అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంతల నిశ్ఛితార్థం కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అతి కొద్ది మంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, ఈ నిశ్చితార్థానికి ఓ ప్రత్యేక అతిథి రావడం గమనార్హం. ఆమె ఎవరో కాదు.. నాగచైతన్య తల్లి. నాగార్జున భార్య. ఆమె పేరు లక్ష్మి. తండ్రి నాగార్జున, తల్లి లక్ష్మితో కలిసి నాగచైతన్య ఒకే వేదికపై కనిపించారు. వారిద్దరూ వారి వారి భాగాస్వాములతోనే కొడుకు నిశ్ఛితార్ధ ఫంక్షన్‌కు హాజరయ్యారు.
సినీ నటి అమలను పెళ్లి చేసుకోవడానికి ముందు నాగార్జున.. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడి కూతురు, హీరో వెంకటేష్, నిర్మాత సురేష్‌బాబుల చెల్లెలు అయిన లక్ష్మిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి నాగచైతన్య పుట్టిన తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఇప్పుడు చైతన్య ఎంగేజ్‌మెంట్ సందర్భంగా అందరూ తమ తమ కుటంబాలతో తరలివచ్చారు.
అలాగే, ఎప్పుడూ పెద్దగా బయటకు రాని వెంకటేష్ భార్య నీరజ, కూతుళ్లు కూడా ఈ ఫంక్షన్‌కు వచ్చారు. ఈ ఫోటోలన్నింటినీ చైతన్య తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘ఓ మరిచిపోలేని రాత్రి.. కొత్త జీవితానికి ప్రారంభం.. ఇంత సంతోషానికి కారణమైన నా సమంతకు ధన్యవాదాలు’ అని చైతూ ట్వీట్ చేశాడు.