గతజన్మ స్మృతుల ఆధారంగా నిర్మించిన చిత్రం 'నాగభరణం'.. 14న రిలీజ్

శుక్రవారం, 7 అక్టోబరు 2016 (19:03 IST)
గతజన్మ స్మృతులను అన్వేషిస్తూ ఓ నాగకన్య సాగించిన ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయో తెలియాలంటే 'నాగభరణం' చూడాల్సిందే అని దర్శకుడు కోడి రామకృష్ణ అంటున్నారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా విజువల్ వండర్ 'నాగభరణం'. రమ్య, దిగంత్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. సాజీద్ ఖురేషి, ధావల్ గడ, సొహైల్ అన్సారీ నిర్మించారు. 
 
సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున్న విడుదల చేస్తున్నారు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. దీనిపై దర్శకుడు మాట్లాడుతూ సోషియోఫాంటసీ ఎంటర్‌టైనర్ ఇది. కొన్ని ప్రతికూల శక్తులపై నాగకన్య ఎలాంటి పోరాటాన్ని సాగించింది? ఆమె నేపథ్యమేమిటనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది. 
 
పతాక ఘట్టాల్లో దివంగత కన్నడ నటుడు విష్ణువర్ధన్‌ను గ్రాఫిక్స్ రూపంలో పునఃసృష్టించిన సన్నివేశాలు అలరిస్తాయి. 'ఈగ', 'బాహుబలి' తర్వాత మకుట సంస్థ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి. ఇటీవలే విడుదలైన పాటలు, ప్రచార చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తుంది. కొత్తదనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరిని ఈ సినిమా మెప్పిస్తుంది అని తెలిపారు. ముకుల్‌దేవ్, రవికాలే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గురుకిరణ్, సినిమాటోగ్రఫీ: వేణు. 

వెబ్దునియా పై చదవండి