టాలీవుడ్ మన్మథుడు అక్కినేన నాగార్జున. ఈయన ప్రస్తుతం యువ హీరోలతో పోటీపడుతున్నాడు. వరుస చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. అదేసమయంలో కుర్ర హీరోయిన్లపై మనసు పారేసుకుంటున్నాడు. తన కొత్త చిత్రంలో కుర్ర పిల్ల కేరళ కుట్టిని ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నాడు.
నిజానికి మలయాళీ భామలు టాలీవుడ్ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నారు. మున్ముందు కూడా మరింతగా ఆలరించబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున సినిమాతో మరో నూతన భామ తెలుగు తెరకి పరిచయం కానున్నట్టు సమాచారం.
చివరిగా "మన్మథుడు 2" చిత్రంతో ప్రేక్షకులని ఈ టాలీవుడ్ కింగ్... త్వరలో 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి ప్రీక్వెల్‌గా "బంగార్రాజు" అనే చిత్రం చేయనున్నట్టు ప్రచారం జరిగింది. కానీ స్క్రిప్ట్ విషయంలో కాస్త తేడా రావడంతో ఆ ప్రాజెక్ట్ అటకెక్కినట్టు సమాచారం.
అలాగనీ, ఆయన ఇంటికే పరిమితం కాలేదు. నూతన దర్శకుడు సాల్మన్‌తో కలిసి నాగార్జున తన తదుపరి ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉండడంతో పాటు కాస్త భిన్నంగా ఉంటుందట.
అందుకోసం తెలుగు ప్రేక్షకులకి పరిచయం లేని కొత్త అమ్మాయితే బాగుంటుందని భావించిన చిత్ర బృందం కొత్త అమ్మాయిని అన్వేషించే పనిలో పడిందట. ఆ పనిలోభాగంగా, కేరళ కుట్టిపై మనసు పారేసుకున్నట్టు సమాచారం.