ఇప్పటివరకు ఫిలింఛాంబర్‌లో కొత్త సినిమాలు ఆరంబించాలంటే ముందుగా టైటిల్స్, నిర్మాణ సంస్థ పేర్లను రిజిష్టర్ చేసుకోవాలి. అయితే మొదటిది కాస్త తలనొప్పిగా మారింది నిర్మాతలకు. రచయిత కథ రాసి, దర్శకుడు దానికి తగిన టైటిల్ ఇది అని రిజిస్టర్ చేశాక, అది అనుకోకుండా బయటకు లీక్ కావడంతో హీరో అభిమానుల మధ్య వివాదానికి దారితీస్తుంది. ఇటీవలే ప్రముఖ హీరో టైటిల్ విషయం మీడియాలో రాగానే వెంటనే అభిమానులు ఆ హీరోకు దర్శకుడికి టైటిల్ మార్చమని ఫోన్లు చేయడం జరిగింది. దీంతో ఇదో పెద్ద సమస్యగా భావించిన నిర్మాతలు ఫిలింఛాంబర్ కార్యవర్గ సమావేశంలో దీనిపై చర్చ పెట్టారు. దాంతో వారంతా కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇకపై మీడియాకు టైటిల్స్ ఇచ్చే ప్రసక్తిలేదని తేల్చిచెప్పారు.