పవన్‌ను ప్రేమించినందుకు.. నిజాలు మాట్లాడినందుకు తనకు దక్కింది ఇదే.. : రేణూ దేశాయ్

గురువారం, 17 ఆగస్టు 2023 (17:12 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల కెక్కారు. పవన్‌‍కు డబ్బంటే ఆసక్తి లేదని, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి అంటూ ఇటీవల వ్యాఖ్యానించారు. అందువల్ల ఆయనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. ఈ వ్యాఖ్యలతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో పవన్ వ్యతిరేకులు మాత్రం రేణూ దేశాయ్‌ను తిట్టిపోస్తున్నారు. 
 
సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ ఉద్దేశించి ఓ నెటిజన్ ఓ కామెంట్ చేశాడు. అందుకే పవన్ నిన్ను తరిమేశాడు మేడం అంటూ అతను వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై రేణూ దేశాయ్ స్పందిస్తూ, తనను అనడం వల్ల నీకు మనశ్శాంతి దొరికిందా? అని ప్రశ్నించింది. మనశ్శాంతి దొరక్కపోతే ఇంకా తిట్టండి అంటూ కూల్‌గా చెప్పారు. తన మాజీ భర్త అభిమానులు, ఆయన వ్యతిరేకుల నుంచి తిట్లు తినడానికే తన జీవితం ఉందని చెప్పారు. 
 
ముఖ్యంగా, తన విడాకుల గురించి నిజాలు మాట్లాడినపుడు తనను తన మాజీ భర్త అభిమానులు తిట్టారని, ఇపుడు దేశ పౌరురాలిగా ఆయన గురించి మంచిగా మాట్లాడితే ఆయన వ్యతిరేకులు తనను తిడుతున్నారని రేణు చెప్పారు. డబ్బులు తీసుకుని విడాకుల గురించి మాట్లాడానని అప్పట్లో పవన్ అనుకూలురు తిట్టారని, డబ్బులు తీసుకుని పవన్‌కు అనుకూలంగా మాట్లాడానని ఇపుడు పవన్ వ్యతిరేకులు తిడుతున్నారని చెప్పారు. తాను చెప్పినవన్నీ నిజాలేనని, ప్రేమించినందుకు, నిజాలు మాట్లాడినందుకు తనకు దక్కింది ఇదేనని అన్నారు. తన తలరాత ఇదే అనుకుంటే ఇంకా తిట్టండి అని ఆమె వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు