పోలీసు అమర వీరుల స్మారక దినోత్సవం సందర్భంగా వర్ధమాన సంగీత దర్శకుడు రమేష్ ముక్కెర `పోలీస్..పోలీస్` అనే ఆడియో ఆల్బమ్ రూపొందించారు. ఈ ఆడియో ఆల్బమ్‌కు దర్శక నిర్మాత లయన్ సాయి వెంకట్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ ఆల్బమ్‌ను సెక్రటేరియట్‌లో తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు రమేష్ ముక్కెర మాట్లాడుతూ... 'నేను గత 20 ఏళ్లుగా పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నా. పోలీసుల కష్ట - సుఖాలు ఏంటో నాకు బాగా తెలుసు. భార్యా పిల్లలను వదిలి ఎన్నో నెలలు అడవుల్లో ఉండాల్సి వచ్చేది. ఇలా నా వ్యక్తిగత జీవితానుభవాలతో రెండు పాటలు రాసి నేనే ఆలపించాను. అలాగే కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర వీరులపై మిగతా మూడు పాటలుంటాయి.
పాటలన్నీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించే విధంగా ఉంటూ పోలీసులపై ఎంతో గౌరవ మర్యాదలు పెంచే విధంగా ఉన్నాయంటూ విన్నవారందరూ ప్రశంసిస్తున్నారు. నేను పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఉంటూ సినిమాల మీద ఉన్న ఇష్టంతో ఇప్పటివరకు 12 సినిమాలకు సంగీతాన్ని అందించాను. రెండు సినిమాలకు దర్శకత్వం చేశాను. ప్రస్తుతం అనువంశికత అనే సినిమా డైరక్ట్ చేస్తున్నా. రేపు జరగబోయే పోలీసు అమర వీరుల స్మారక దినోత్సవం సందర్భంగా రూపొందించిన ఈ ఆల్బమ్‌ను పోలీసు అమర వీరులకు అంకితమిస్తున్నా. ఈ ఆల్బమ్‌ను నిర్మించిన లయన్ సాయి వెంకట్‌కి ధన్యవాదాలు తెలుపుకుంటున్న అని చెప్పుకొచ్చారు.
దర్శక నిర్మాత లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ... 'ఎంతో మంచి సంకల్పంతో రమేష్ రూపొందించిన ఈ ఆల్బమ్‌కు నిర్మాతగా వ్యవహరించడం ఆనందంగా ఉంది. ఈ బుధవారం సెక్రటేరియట్‌లో తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహా రెడ్డి చేతుల మీదుగా పోలీస్.. పోలీస్ ఆడియో ఆల్బమ్ విడుదల చేశాం. వారు పాటలన్నీ విని ఎంతో స్ఫూర్తిదాయకంగా పాటలున్నాయంటూ అభినందించారు. రమేష్ ముక్కెర ఐదు పాటలు కూడా అద్భుతంగా చేశారు. ఇంత మంచి పాటలు ప్రతి పోలీసు స్టేషన్‌లో ఉండాలంటూ వేణుమాధవ్ రెండు రాష్ట్రాలకు ఐదు వేల సీడీలు పంపిణీ చేస్తున్నారు. అందరూ విని మా ప్రయత్నాన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను' అన్నారు.
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ... 'పోలీసు అమర వీరులకు అంకితమిస్తూ ఈ ఆడియో ఆల్బమ్‌ను రూపొందించిన సాయి వెంకట్‌ను, రమేష్ ముక్కెరను అభినందిస్తున్నాను' అన్నారు. రామ సత్యనారాయణ మాట్లాడుతూ... ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయడంలో సాయి వెంకట్ ఎప్పుడూ ముందుంటారు. రమేష్ ముక్కెర ఎంతో స్ఫూర్తిదాయకంగా పాటలు చేశారు. ఈ ఆల్బమ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ అనన్య, నిర్మాత అనుపమ రెడ్డి, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.