తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నృత్య దర్శకుడు రాకేశ్ మాస్టర్ (53) ఆకస్మికంగా మృతి చెందారు. దాదాపు 1500కు పైగా పాటలకు కొరియోగ్రఫీ చేసిన రాకేశ్ మాస్టర్ మృతితో తెలుగు చలన చిత్ర దాపరిశ్రమలో విషాదం నెలకొంది. అగ్ర కథానాయకుల నుంచి యంగ్ హీరోల చిత్రాలకు పనిచేసిన ఆయనకు సోషల్ మీడియా వేదికగా పలువురు సంతాపం ప్రకటించారు.
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఇటీవల విజయనగరం నుంచి హైదరాబాద్ నగరానికి తిరిగి వస్తుండగా వడదెబ్బకు గురైనట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయన రక్త విరోచనాలతో బాధపడ్డారు. ఆయనను గాంధీ ఆస్పత్రిలో చేర్చగా వైద్యులు ప్రయత్నాలు ఫలించలేదు. రాకేశ్ మాస్టర్ సినీ కొరియోగ్రఫర్‌గా కొన్ని వందల చిత్రాలకు పని చేశారు. ప్రస్తుతం అగ్రశేణి కొరియోగ్రాఫర్‌గా శేఖర్ మాస్టర్... రాకేశ్ మాస్టర్ శిష్యుడే కావడం గమనార్హం.