ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా Does Size Matter అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పేపర్ బాయ్ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ఈ మాయలో.., సామిరంగా లిరికల్ సాంగ్స్ యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. కార్తీక్ రాపోలు ఏక్ మినీ కథ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సినిమాను ఎప్రిల్ 30న విడుదల చేస్తామంటూ ఇదివరకే దర్శక నిర్మాతలు ఖరారు చేసారు. అయితే ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే హీరో సంతోష్ శోభన్, నటుడు సుదర్శన్ కలిసి ఓ సరదా వీడియో కూడా చేసారు. పరిస్థితులు అన్నీ చక్కబడిన తర్వాత కొత్త తేదీని అనౌన్స్ చేస్తామని చెప్పారు. అందరూ ఇంట్లోనే సేఫ్‌గా ఉండాలంటూ కోరారు హీరో సంతోష్ శోభన్.