ఫ్లెక్సీ కడుతూ ప్రభాస్ అభిమాని దుర్మరణం... మరో నలుగురికి గాయాలు

శుక్రవారం, 23 అక్టోబరు 2020 (11:43 IST)
తమ అభిమాన హీరోల పుట్టిన రోజులంటే ఫ్యాన్స్‌కు పండగే. ఇలాంటి వేడుకలను పురస్కరించుకుని అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే, ఇలాంటి హంగమాలో పలు సందర్భాల్లో విషాదకర సంఘటనలు జరిగాయి. మొన్నటిమొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని అభిమానులు కటౌట్ కడుతూ కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఫ్లెక్సీ కడుతూ ఓ అభిమాని ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం పూనురులో జరిగింది.
 
ఈ ప్రాంతానికి చెందిన సుగుణా రావు అనే అభిమాని పెద్ద ప్లెక్సీని తయారు చేయించాడు. దాన్ని బహిరంగంగా ప్రదర్శించాలన్న ఉద్దేశంతో కడుతున్న వేళ, పక్కనే ఉన్న విద్యుత్ వైర్లు సుగుణా రావుకు తగిలాయి. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. 
 
ఇదే ఘటనలో ప్లెక్సీ కట్టేందుకు సాయం చేస్తున్న మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా, వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనతో పూనురులో విషాద వాతావరణం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలిని సందర్శించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు