హిందీ, తెలుగు భాషల్లో ప్యారి - తారావలి ది ట్రూ స్టోరీ

బుధవారం, 13 సెప్టెంబరు 2023 (19:37 IST)
Pyari - Taravali
మధ్యప్రదేశ్ లో ఓ అమ్మాయి జీవితంలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా హిందీ - తెలుగు భాషల్లో తెరకెక్కిన హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ "ప్యారీ". తారావాలి - ది ట్రూ స్టోరీ అనేది ట్యాగ్ లైన్. పలు సూపర్ హిట్ హిందీ ధారావాహికలు, వీడియో ఆల్బమ్స్ తో సుప్రసిద్ధురాలయిన డాలి తోమర్ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని ఓంషీల్ ప్రొడక్షన్స్ పతాకంపై కల్పన తోమర్-అమిత్ గుప్తా సంయుక్తంగా నిర్మించారు. రహమాన్ అలి - రాజారామ్ పాటిదార్ సహ నిర్మాతలు. 
 
పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పలు విభాగాల్లో అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం హిందీ - తెలుగు భాషల్లో అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాగా తెరకెక్కడానికి ముందే పుస్తక రూపంలో వెలువడి లక్షలాది పాఠకుల మనసులు దోచుకున్న "ప్యారీ" రచయిత రజనీష్ దూబే ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతోపాటు లక్ష్మణ్ పాత్రను పోషించడం విశేషం. అంతేకాదు... ఆర్.పి.సోనితో కలిసి ఈ చిత్రానికి సంగీత సారథ్యం సైతం వహించారు. కొన్ని కాలాలపాటు... మళ్లీ మళ్లీ వినాలనిపించేలా మాత్రమే కాదు, చూసినకొద్దీ మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా "ప్యారీ" చిత్రంలోని గీతాలు రూపొందడం గమనార్హం. 
 
ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజారామ్ పాటిదార్, జిగ్నేష్ షా, మనీషా సింగ్ ముఖ్య అతిధులుగా పాల్గొని "ప్యారీ" పెద్ద హిట్ కావాలని కోరుకున్నారు. చిత్ర కథానాయిక డాలి తోమర్, రచయిత - నటుడు - దర్శకుడు రజనీష్ దూబే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ... స్వేచ్ఛను - స్వచ్ఛమైన ప్రేమను కోరుకునే ఓ మగువ మనసును ఎంతో హృద్యంగా ఆవిష్కరిస్తూ రూపొందిన "ప్యారీ" ఇప్పటివరకు భారతీయ తెరపై రూపొందిన అత్యుత్తమ ప్రేమ కథా చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు