రాజేంద్రప్రసాద్ బేవర్స్.. ఇది నిజంగా నిజం అంటున్నారు. ఏమిటి విషయం అనుకుంటున్నారా..? ఆ నలుగురు, మీ శ్రేయాభిలాషి తదితర వైవిధ్యమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం బేవర్స్. సంజోష్, హర్షిత హీరోహీరోయిన్లుగా నటించారు. కాసం సమర్పణలో ఎస్.ఎస్.కె ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాతలు పొన్నాల చందు, డా.ఎం.ఎస్.మూర్తి, ఎమ్ అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించారు.
ఈ సందర్భంగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… మొదట్లో ఈ చిత్రానికి బేవర్స్ అనే టైటిల్ ఏంటి అనుకున్నాను. ఇదే డౌటు ఆడియెన్స్‌కి కూడా వస్తుంది. కానీ ఆ టైటిల్ ఎందుకు పెట్టారనేది ఈ చిత్రం చూస్తే అర్థమవుతుంది. తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలు మాత్రమే బేవర్స్ కాదు… పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులు కూడా బేవర్స్ అవుతారనే కాన్సెప్టుతో ఈ సినిమా రూపొందించారు. డైరెక్టర్ రమేష్ డైలాగ్స్ అద్భుతంగా రాశాడు. సామాజిక స్పృహ ఉన్న చిత్రం. నా కెరీర్లో మరో సూపర్ హిట్ సినిమా చేశాను అనే తృప్తి వుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది.
ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తన మనసు, ప్రాణం పెట్టి రాసిన.. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా.. నీవే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా.. నా ఇంట నువ్వుంటే మాయమ్మే వుందంటూ మురిసానమ్మా.. ఏ జన్మలో పాపమో నేను చేశానో ఈ శిక్షవేశావమ్మా.. పోద్దున్నే పోద్దల్లే నువు నాకు ఎదురోస్తే అదృష్టం నాదనుకున్నా.. సాయంత్రం వేళల్లో నా బ్రతుకు నీడల్లొ నా దీపం నీవనుకున్నా.. లోకంలొ నేనింకా ఏకాకినైనట్టు శూన్యంలో వున్నానమ్మా.. చిరుగాలిలో ఊగే ఏ చిగురు కొమ్మైనా నీలాగే తోచేనమ్మా.. అంటూ సాగే అద్బుతమైన సాంగ్ చాలా మంచి హిట్‌గా నిలిచింది. హీరోహీరోయిన్లు చాలా బాగా చేశారు. ఈ సినిమా నా కెరీర్లో మరో మంచి చిత్రంగా నిలుస్తుంది. అక్టోబర్ 5న విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు అని అన్నారు.