డిసెంబర్ 31న తేల్చేస్తా : యుద్ధరంగంలో దిగితే గెలవాల్సిందే : రజనీకాంత్

మంగళవారం, 26 డిశెంబరు 2017 (09:51 IST)
తన రాజకీయరంగ ప్రవేశంపై మీడియాలో వస్తున్న వార్తలపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ క్లారిటీ ఇచ్చారు. తన రాజకీయ రంగ ప్రవేశం తనకంటే మీడియాకే అమితాసక్తిగా ఉందని వ్యాఖ్యానించిన సూపర్‌స్టార్... ఏదిఏమైనా ఈనెల 31వ తేదీన తన రాజకీయ రంగ ప్రవేశంపై ఓ స్పష్టమైన ప్రకటన చేస్తానని ప్రకటించారు. 
 
ఆయన మంగళవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు అభిమానులతో భేటీకానున్నారు. ఇందులోభాగంగా చెన్నై, కోడంబాక్కంలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో ఆయన మంగళవారం అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, త‌ను హీరో కావ‌డం త‌న‌కే ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంద‌నీ, ఆరంభంలో చాలా భ‌య‌ప‌డ్డాన‌ని తెలిపారు. హీరో కావాల‌ని సినిమాల్లోకి రాలేదన్నారు. తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఓ 10 లేదా 12 చిత్రాల్లో నటిస్తే చాలని అనుకున్నానని తెలిపారు.
 
అయితే, అదృష్టం నా ఇంటి తలపుతట్టి హీరో అయ్యానని, హీరోగా తన తొలి సంపాద‌న రూ.50 వేలు అని ర‌జినీ తెలిపారు. రాజ‌కీయాలు నాకు కొత్త కాదు.. ఇప్ప‌టికే ఆల‌స్యం చేశా... నేను రాజ‌కీయాల‌లోకి రావ‌డ‌మంటే విజ‌యం సాధించిన‌ట్టే అని ర‌జినీకాంత్ స్ప‌ష్టం చేశారు. యుద్ధానికి వెళితే గెలవాల్సిందేనని ప్రకటించారు. 
 
ఇదిలావుండగా, 26వ తేదీన జరుగుతున్న ఫ్యాన్స్‌మీట్‌లో కాంచీపురం, తిరువళ్లూర్, కృష్ణగిరి, ధర్మపురి, నీలగిరి జిల్లాల అభిమానులతో సమావేశమయ్యారు. 27న తిరువారూర్, నాగపట్టణం, పుదుకోట్టై, రామనాథపురం అభిమానులతోనూ, 28వ తేదీన మదురై, నామక్కల్, సేలం ఫ్యాన్స్‌ను, 29వ తేదీన కోయంబత్తూరు, ఈరోడ్, వేలూరు ఫ్యాన్స్‌ను, నార్త్, సెంట్రల్‌ చెన్నై ఫ్యాన్స్‌ను 30న, సౌత్‌ చెన్నై ఫ్యాన్స్‌ను 31వ తేదీన సమావేశం కానున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు