#Rakshasudu Movie Review-శ్రీనివాస్‌ ఖాతాలో హిట్ ఖాయమా?

శుక్రవారం, 2 ఆగస్టు 2019 (12:55 IST)
రమేష్ వర్మ తెలుగు రీమేక్ రాక్షసుడు శుక్రవారం విడుదలైంది. తమిళంలో హిట్ అయిన ''రాట్చసన్'' సినిమాను తెలుగులో రమేష్ వర్మ రాక్షసుడు పేరిట రీమేక్ చేశాడు. బెల్లం కొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్‌గానూ, అనుపమ టీచర్‌గానూ కనిపిస్తుంది. 
 
పెద్దపెద్ద దర్శకులు, హీరోయిన్లతో పనిచేస్తోన్న ఈ బెల్లంకొండవారి అబ్బాయి సాయి శ్రీనివాస్‌కు ఇంకా సరైన బ్రేక్ రాలేదు. ఈ ఏడాది ‘సీత’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి శ్రీనివాస్ నిరాశపరిచారు. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అయితే, ఇప్పుడు ‘రాక్షసుడు’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్‌తో శ్రీనివాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అయినా అతనికి మంచి గుర్తింపును సంపాదించిపెడుతుందో లేదో చూడాలి. 
 
రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ డైలాగులు రాశారు. ఎ స్టూడియోస్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై కోనేరు స‌త్యనారాయ‌ణ నిర్మించారు. అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను విడుదల చేసింది. ట్రైలర్‌తో సినిమాపై ఆసక్తిని రేకెత్తించిన రాక్షసుడు ఈ శుక్రవారం (ఆగస్టు 2న) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లో కన్నా ముందుగానే యూఎస్‌లో ప్రీమియర్ షోలో ప్రదర్శించారు. అక్కడ సినిమాను చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. 
 
‘రాక్షసుడు’ సినిమా చాలా బాగుందని అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు కొనియాడుతున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆకట్టుకున్నాడట. గత సినిమాలతో పోలిస్తే ఇందులో ఆయన నటన చాలా బాగుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం స్క్రీన్‌ప్లే అని చెబుతున్నారు. రేసీ స్క్రీన్‌ప్లే‌తో ప్రేక్షకుడికి మంచి అనుభూతిని అందించారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 
 
జిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ సినిమాకు మరో బలం. ఇంటర్వెల్ బ్లాక్ అయితే అదిరిపోయిందని కొందరు ట్వీట్లు చేస్తున్నారు. మొత్తంగా సినిమా అయితే చాలా బాగుందని, ఎంగేజింగ్ థ్రిల్లర్ అని టాక్ వస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా అదరగొట్టాడు. అనుపమ పాత్రకు తగ్గట్టు ఒదిగిపోయింది. ఇక శరవణన్, వినోద్ సాగర్, రాజీవ్ కనకాల, వినోదిని వైద్యనాథన్, అమ్ము అభిరామి, సూర్య, రాధారవి తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు