వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మళ్లీ మరో కొత్త సినిమాను నిర్మించనున్నారు. ఇందుకోసం ఆయన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు. బుధవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా లంచ్ సమావేశం జరిపారు. అపుడే ఆయన ఓ సినిమా తీయనున్నారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అందరూ ఊహించినట్టుగానే తాను కొత్త చిత్రం నిర్మించనున్నట్టు గురువారం ప్రకటించారు. ఇది రాజకీయ సినిమా అని సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే, ఇది బయోపిక్ కాదని, బయోపిక్ కంటే లోతైన రియల్ పిక్ అని వెల్లడించారు.
ఇది రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందని, రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహాన్ని ప్రతిబింభించేలా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం వ్యూహం షాక్ నుంచి తేరుకునేలోపు రెండో భాగం శపథంలో మరో ఎలక్ట్రిక్ షాక్ తగులుతుందన్నారు. కాగా, తనతో వంగవీటి చిత్రాన్ని నిర్మించిన దాసరి కిరణ్ ఈ పొలిటికల్ చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తారని వర్మ వెల్లడించారు.