శ్రీలీల నాయికగా రవితేజ 75వ చిత్రం - నేటి నుంచే షూటింగ్ షురూ

డీవీ

మంగళవారం, 11 జూన్ 2024 (11:09 IST)
Ravi Teja, Srileela
మాస్ మహారాజా రవితేజ ఎందరో ఔత్సాహిక దర్శకులకు, నటీనటులకు స్ఫూర్తి. తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్, విలక్షణమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. స్వయంకృషితో స్టార్ గా ఎదిగిన రవితేజ, యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. అలా యువ దర్శకులతో పని చేసి పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను, గుర్తుండిపోయే పాత్రలను అందించారు. 
 
Ravi Teja, Srileela, Suryadevara Nagavanshi
తెలుగు చిత్రసీమలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి రవితేజ 75వ చిత్రాన్ని ప్రొడక్షన్ నంబర్ 28 గా నిర్మిస్తోంది. యువ రచయిత భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
 
మాస్ మహారాజా రవితేజ పేరు వినగానే గుర్తొచ్చేది మాస్, కామెడీ. తనదైన మాస్ యాటిట్యూడ్, కామెడీ టైమింగ్ తోనే ఆయన ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు రవితేజ తన 75వ చిత్రంలో హాస్యంతో కూడిన మాస్ పాత్రలో కనిపించనున్నారని చిత్రబృందం వెల్లడించింది. వినోదంతో కూడిన పూర్తిస్థాయి మాస్ పాత్రలో రవితేజను చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంతో అభిమానుల కోరిక నెరవేరుతుందని చిత్ర బృందం హామీ ఇచ్చింది.
 
బ్లాక్ బస్టర్ చిత్రం 'వాల్తేరు వీరయ్య'కి మాటల రచయితగా, మరో బ్లాక్ బస్టర్ 'సామజవరగమన'కు కథ, స్క్రీన్‌ప్లే రచయితగా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు భాను బోగవరపు. నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా తెరకెక్కుతోన్న 'NBK109'కి సంభాషణలు అందిస్తున్నారు. ఇలా రచయితగా అనతి కాలంలోనే తనదైన ముద్ర వేసిన భాను బోగవరపు, ఇప్పుడు రవితేజ కెరీర్ లో ఓ  మైలురాయి లాంటి ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ చిత్రంతో అదిరిపోయే మాస్ ఎంటర్‌టైనర్‌ను అందించడానికి సిద్ధమవుతున్నారు.
 
ఈ సినిమాలో యువ సంచలనం శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. రవితేజ-శ్రీలీల జోడి గతంలో "ధమాకా"తో బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. అలాగే "ధమాకా" విజయంలో కీలకపాత్ర పోషించిన సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
 
ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుడు విధు అయ్యన్న ఛాయాగ్రాహకుడిగా వ్యవరిస్తున్న ఈ చిత్రానికి, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భాను కథ-కథనం అందించిన ఈ చిత్రానికి నందు సవిరిగాన సంభాషణలు రాస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
 
జూన్ 11వ తేదీన ఉదయం 07:29 గంటలకు పూజా కార్యక్రమంతో మేకర్స్ అధికారికంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు షాట్ కి శ్రీలీల క్లాప్ కొట్టగా, భాను బోగవరపు దర్శకత్వం వహించారు. నేటి నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.
 
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు