ఇటీవలి ప్రెస్‌మీట్‌లో ఆర్ఆర్ఆర్ విశేషాల గురించి చెప్పిన రాజమౌళి ఇందులో కనిపించే మరికొందరు ప్రధాన నటుల గురించి కూడా చెప్పాడు. ఈ సినిమాలో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు రాజమౌళి చెప్పాడు. అయితే ఎన్టీఆర్, రామ్‌చరణ్ పాత్రల గురించి చెప్పిన జక్కన్న అజయ్ దేవగన్ పాత్ర గురించి చెప్పలేదు. అయితే అజయ్ దేవగన్ పాత్ర ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుందని మాత్రం చెప్పాడు.
ఈ సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర నిడివి అరగంట మాత్రమే ఉంటుందని సమాచారం. ఫ్లాష్‌బ్యాక్ 40 నిమిషాల పాటు ఉంటే అందులో 30 నిమిషాల్లో చాలా కీలకమైన అజయ్ దేవగన్ పాత్ర కనిపిస్తుందట. అల్లూరి, కొమరం భీంలు యుక్తవయస్సులో తమ స్వస్థలాలను వదిలి ఉత్తర భారతదేశానికి వెళ్లడం, ఒక లక్ష్యమంటూ లేకుండా ఉత్తర భారతానికి వెళ్లిన ఇద్దరిలో స్ఫూర్తి నింపి వారికి దిశా నిర్దేశం చేసే పాత్రలో అజయ్ దేవగన్ కనిపిస్తాడట.
స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో కనిపించే అజయ్ దేవగన్ పాత్రను చూసి హీరోలు ఇద్దరూ స్ఫూర్తి పొందుతారట. హీరోలిద్దరినీ మార్చాలంటే అజయ్ పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉండాలని, దానికి తగ్గట్లే ఆ పాత్రను జక్కన్న మలచినట్లు సమాచారం. అయితే అజయ్ దేవగన్ పాత్ర తక్కువసేపు కనిపించినా కూడా సినిమాపై ఎక్కువ ప్రభావం చూపుతుందట.