పెద్ద సినిమా చేశాక.. ఈగో వచ్చింది.. ఇండస్ట్రీ నా వెంటపడుతుందనుకున్నా.. : బుర్రా సాయిమాధవ్
బుధవారం, 4 జనవరి 2017 (09:38 IST)
బాలకృష్ణ హీరోగా జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న మూవీ 'గౌతమిపుత్ర శాతకర్ణి'. సంక్రాంతికి సినిమా విడుదలవుతున్న సందర్భంగా సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రాతో ఇంటర్వ్యూ...
* మీరు శాతకర్ణి గురించి చదివారా?
శాతకర్ణి, శాతావాహనులు గురించి ఆసక్తి ఉండేది. ఎప్పుడైతే క్రిష్ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేద్దామని అన్నారో నేను కూడా శాతకర్ణి గురించి స్టడీ చేయడం మొదలు పెట్టాను. 'కష్ణం వందే జగద్గురమ్' సినిమా తర్వాతే క్రిష్‌కి శాతకర్ణి సినిమా గురించిన ఆలోచన వచ్చింది. అప్పటి నుండి స్టడీ చేయడం మొదలు పెట్టారు. మధ్యలో 'కంచె' సినిమా తీశారు. ఆ తర్వాత హిందీ 'గబ్బర్' సినిమాలను చేస్తూనే ఈ సినిమా గురించి వివరాలు సేకరించారు.
* ఎటువంటి పరిశోధన చేశారు?
దీని గురించి వివిధ పుస్తకాలు సేకరించాం. దాని నుంచి వివరాలు రాబట్టాం. శాతకర్ణి గురించి ఎక్కువగా స్టడీ చేసింది క్రిష్ మాత్రమే. క్రిష్ నాసిక్ శాసనాలు, యూనివర్సిటీ పుస్తకాలు, యజ్ఞశ్రీ శాతకర్ణికి ఆచార్య నాగార్జునుడు రాసిన లేఖలు చదివినప్పుడు అప్పటి సంస్క తిని తెలుసుకున్నాం. నేను కూడా తెనాలిలోని గ్రంథాలయానికి వెళ్ళి వెతికాను. అన్నిటికంటే నా స్నేహితులు ఇచ్చిన కొన్ని పుస్తకాలు చాలా ఉపయోగపడ్డాయి.
* కథలో కల్పితాలుంటాయా?
కథలో ఎక్కడా ఫిక్షన్ లేదు. చరిత్రలో ఏం జరిగిందో దాన్నే సినిమాగా తీశాం. సినిమా ప్రకారం సన్నివేశాలను డ్రెమటైజేషన్ చేశాం.
* ఇలాంటి చిత్రాల్లో భాష ఎలా వాడతారు?
హిస్టారికల్ మూవీస్ అల్రెడి చూసిన అనుభవం ఉంది. తెనాలి రామకష్ణుడు, చాణక్య చంద్రగుప్తుడు ఇలా చాలా సినిమాలు వచ్చాయి. ఇలాంటి సినిమాలకు పనిచేయాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ అవకాశం రాదు. నాకు అవకాశం వచ్చింది. సద్వినియోగం చేసుకున్నాను. ఆనాటి కథ కాబట్టి అప్పటి లాంగ్వేజ్ రాస్తే ఎవరికీ అర్థంకాదు. ఇప్పటి భాషను రాస్తేను అర్థమవుతుంది. దాన్నే నేను చేశా.
* బాలకృష్ణకు డైలాగ్స్ చెప్పగానే మొదట ఏమన్నారు?
ఫస్ట్ రోజు భయపడ్డాను. 99 సినిమాలు చేసిన బాలకష్ణ నా ఎదురుగా కూర్చొని ఉన్నారు. ఎందరో మహానుభావులు రాసిన డైలాగ్స్ చెప్పిన వ్యక్తి. మన డైలాగ్స్ నచ్చుతాయో లేదో, ఏమంటారోనని ఫస్ట్ రోజు భయపడ్డాను. కానీ ఆయన డైలాగ్స్ చదవగానే చాలా బావున్నాయంటూ బాలకష్ణ కితాబిచ్చారు.
* చిరంజీవి సినిమాకూ మీరే రాశారా?
గౌతమిపుత్ర శాతకర్ణితో పాటు 'ఖైదీ నంబర్ 150' సినిమాకు కూడా కొన్ని డైలాగ్స్ నేను రాశాను. ఇప్పుడు రెండు సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు ప్రెస్టీజియస్ మూవీస్ కావడం ఇంకా గొప్పగా ఉంది.
* రెండు చిత్రాల పోటీ వుందా? లేదా వన్‌సైడ్ యుద్ధమేనా?
వార్ వన్ సైడ్ అయ్యింది... వంటి మాటలను నేను పట్టించుకోను. సినిమాను ఒక వ్యక్తిగా చూడకూడదు. ఎందుకంటే సినిమా ఒక వ్యక్తి కాదు. వ్యవస్థ. కొన్ని వందల మంది కష్టం ఉంటుంది. కాబట్టి నేను పనిచేసినా, చేయకపోయినా అన్ని సినిమాలు బాగా ఆడాలి. నిర్మాత బాగుంటే ఇండస్ట్రీ బావుంటుంది.
* అసలు కథంతా చెప్పారా?
లేదు. శాతకర్ణి విజయాల వరకే చెప్పాం. అప్పట్లో భారతదేశం చిన్నచిన్న గణ రాజ్యాలుగా ఉండేవి. ఇలాంటి గణ రాజ్యాలను కలిపి ఒక దేశంగా ఎలా చేశాడనేదే గౌతమిపుత్ర శాతకర్ణి. సినిమా అంతా ఒక జర్నీలా ఉంటుంది. దేశమంతటినీ జయిస్తూ రావడం వల్ల 'త్రి సముద్ర తోయ పాన వాహన' అనే బిరుదు కూడా ఉండేది. అంటే ఆయన గుర్రాలు మూడు సముద్రాల నీటిని తాగాయని అర్థం. అటువంటి గుర్రాలను అధిరోహించి యుద్ధం చేసిన వాడని అర్థం. చరిత్ర ప్రకారం గౌతమిపుత్ర శాతకర్ణికి ఒకటమనేదే లేదు. ఆయన మరణం కూడా సహజ మరణమే. అయితే సినిమాలో ఆయన దేశాన్ని ఎలా ఏకం చేశాడనే విజయగాథను చూపించాం.
* సహజంగా రైటర్స్ దర్శకులుగా మారుతున్నారు? మరి మీరు?
నాకు దర్శకుడిగా మారే ఆలోచన లేదు. రచయితగానే కొనసాగుతా. ఇంకా రాయాల్సి చాలా వుంది. దర్శకుడిగా మారితే ఆలోచనలు పరిమిత అవుతాయి. ఎదగలేను.
* ఇండస్ట్రీలో రచయిత పరిస్థితి ఎలా వుంది?
ప్రస్తుతం ఇండస్ట్రీలో రచయితలు తక్కువ. దర్శకులు ఎక్కువగా వున్నారు. అందుకే నాలాంటి వాడికి ఛాన్స్ వస్తుంది.
* కృష్ణం వందే.. రాశాక.. చాలా కాలం గ్యాప్ వచ్చిందే?
అవును. రెండేళ్ళగ్యాప్. నేను పెద్ద సినిమా రాశాక.. నాకేంటి? అనే ఈగో ఒకటి వచ్చేసింది. ఇండస్ట్రీ మన వెంట పడుతుందనుకున్నా. కొన్ని కథలు వచ్చినా పారితోషికం విషయంలో వదులుకున్నా. అలా ఒకసారి వెనక్కి చూసుకుంటే రెండేళ్ళపట్టింది. నేను చేస్తుంది కరెక్ట్‌కాదని అప్పుడు తెలుసుకున్నా.
* కొత్త సినిమాలకు రాస్తున్నారా?
మంజులగారి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా చేయనున్న సినిమాతో పాటు కీర్తిసురేష్ టైటిల్ పాత్రలో సావిత్రిగారి బయోపిక్ మహానటి సినిమాకు డైలాగ్స్ రాస్తున్నాను.