కోలీవుడ్ సినీ దర్శకుడు, నటుడు అయిన సముద్రకని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలపై నోరెత్తారు. రజనీకాంత్ వీరాభిమాని అయిన సముద్రకని సందేశాత్మక సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట. తాజాగా రజనీ హీరోగా నటించే కాలా చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. సముద్రకని స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తొండన్ సినిమా గతవారం విడుదలైంది.
ఈ సందర్భంగా ఆయన ప్రజల్లో తన చిత్ర స్పందన తెలుసుకోవడానికి పలు జిల్లాల పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం కోవై వెళ్లిన సముద్రకని విలేకరులతో మాట్లాడుతూ.. తొండన్ సినిమాకు ప్రేక్షకుల పూర్తి మద్దతుందన్నారు. ఇటీవల యువత జల్లికట్టు పోరుబాటను భారతీయార్, అబ్దుల్‌కలాం చూసి ఉంటే ఎంతో సంతోషించేవారన్నారు.
ఈ తరం యువత చాలా పరిపక్వత ఉందని.. సినిమా పన్ను విషయంపై నోరెత్తిన కమల్ హాస్‌న్ భావాలను స్వాగతిస్తానని చెప్పారు. రజనీకాంత్ వీరాభిమానినైన తాను ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కాలా చిత్రంలో ఒక పాత్ర పోషిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆయన రాజకీయరంగం గురించి అడుగుతున్నారని, రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చునని, వారికి ప్రజల మద్దతే ముఖ్యమని సముద్రకని పేర్కొన్నారు.
సముద్రకని వ్యాఖ్యలను బట్టి కమల్ హాసన్, భారతీరాజా వ్యాఖ్యలకు ఝలక్ ఇచ్చారని కోలీవుడ్ జనం అనుకుంటున్నారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై కమల్ మాట్లాడుతూ.. ఆయనకు ఎప్పుడూ కెమెరా ముందు వుండాలనే ఆరాటమని కమల్ అంటే.. దర్శకుడు భారతీరాజా తమిళ ప్రజలకు తమిళుడే పాలించాలని తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.