చిరంజీవి 'కత్తి'కి పదును పెడుతున్న రచయిత ఎవరు? పరుచూరి బ్రదర్స్ సంగతేంటి?

మంగళవారం, 19 జులై 2016 (14:27 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం కత్తి. ఈ చిత్రానికి  మాటల రచయితలుగా పరుచూరి బ్రదర్స్ పని చేస్తున్నారు. ఈ చిత్రం పట్టాలెక్కేంత వరకు వీరిద్దరే సంభాషణల రచయిత అని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే, అతి తక్కువ కాలంలోనే సంభాషణల రచయితగా మంచి గుర్తింపు తెచ్చకున్న సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి కలం కదిలిస్తున్నారట. 
 
నిజానికి తొలి నుంచి వివి వినాయక్ చిత్రాలకు పరుచూరి బ్రదర్సే మాటల రచయితలుగా ఉంటారు. అయితే, తాజాగా కత్తిలాంటోడు చిత్రం కోసం వీరికి 'కృష్ణం వందే జగద్గురం' సినిమాతో తెరపైకి వచ్చిన సాయి మాధవ్ తోడయ్యారు. అబ్బూరి రవి కూడా ఈ సినిమా కోసం కొన్ని మాటలు మూటగడుతున్నారట. రచయితలుగా పరచూరి సోదరుల గురించి నేడు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. 
 
అయినప్పటికీ సాయి మాధవ్‌ సీన్‌లో ఎంటరవడం విశేషం. సినిమాకి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాల్లో సందేశాత్మక సంభాషణలు రాయడానికే సాయి మాధవ్‌ని సంప్రదించారని సమాచారం. ఆ మధ్య సాయి మాధవ్ ప్రతిభ గుర్తించిన పవన్ ‘గోపాల గోపాల’, ‘సర్దార్’ సినిమాలకు మాటలు రాయించారు. సంభాషణల పరంగా ‘గోపాల గోపాల’కు ఎలాంటి స్పందన లభించిందో తెలిసిందే. ఇప్పుడు చిరు రీ ఎంట్రీ సినిమాకీ సాయి మాధవ్ సహకారం తోడవటంతో ‘కత్తి’ మరింత పదునెక్కిందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయట. 

వెబ్దునియా పై చదవండి