హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన సోదరుడు భరత్ అంత్యక్రియలకు టాలీవుడ్ హీరో రవితేజ హాజరుకాలేదు. శనివారం రాత్రి జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో భరత్ మృతి చెందిన విషయం తెల్సిందే. కారును 140 కిలోమీటర్ల వేగంతో నడిపి రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టడంతో భరత్ ప్రమాదస్థలిలోనే కన్నుమూశాడు. భరత్ అంత్యక్రియలు ఆదివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో జరిగాయి.
ఈ కార్యక్రమాన్ని రవితేజ మరో సోదరుడు రఘు నిర్వహించారు. భరత్ అంత్యక్రియలకు ఆయన మిత్రులు, సహనటులు హాజరయ్యారు. అయితే, రవితేజ, మిగిలిన కుటుంబ సభ్యులెవ్వరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీనిపై మీడియాలో పలు రకాల కథనాలు వచ్చాయి.
దీంతో రవితేజ స్పందిస్తూ, ఎందుకు హాజరు కాలేకపోయామనే విషయాన్ని మిత్రులు, మీడియా అర్థం చేసుకోవాలని కోరారు. ఛిద్రమైపోయిన భరత్ భౌతికకాయాన్ని చూసి భరించలేనంటూ కుమిలిపోయిన రవితేజ, తన తమ్ముడితో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు.