సమాజ హితం కోరే సినిమాలు రావాలా? - అది సాధ్యమేనా? స్పెషల్ స్టోరీ

డీవీ

శనివారం, 28 డిశెంబరు 2024 (17:52 IST)
సినిమాలు సమాజానికి మేలు  చేయాలి, వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించాలి. చెడు అలవాట్లను ప్రేక్షకులపై రుద్దకూడదు అనే కొన్ని నిబంధనలు వున్నాయి. అవి తెలిసిన పాతతరం పౌరాణికం, జానపదం, సాంఘిక చిత్రాలు తీసి మెప్పించారు. కానీ రానురాను కాలం మార్పు పేరుతో అసలు నిబంధనలు వున్నాయని తెలియని దర్శకులు పుట్టుకొచ్చారు. దాంతో కొత్త ఒరవడి  అంటూ పబ్ కల్చర్‌తో సినిమాలు వచ్చాయి. ఒకప్పుడు ఐటెం సాంగ్‌కు జ్యోతిలక్ష్మి, జయమాలినితో పాటు కొందరుండేవారు.

కానీ ఇప్పుడు ట్రెండ్ పేరుతో హీరోయిన్లతో ఐటెం సాంగ్ చేపిస్తున్నారు. అదేమిటని అడిగితే నటిగా అన్ని పాత్రలు చేయాల్సిందే కదా అంటూ కబుర్లు చెబుతుంటారు. సమంత లాంటి నటిగా కూడా ఐటెం సాంగ్ చేసి ఆ తర్వాత ఫ్యామిలీ మాన్ అనే సినిమాలో పూర్తిగా కోరికలతో రగిలిపోయే పాత్రనూ పోషించింది. థియేటర్ నుంచి సినిమా ఓటీటీకి మారడంతో కథల్లో మార్పు వచ్చిందని కొందరు దర్శకనిర్మాత, హీరో మేధావులు చెబుతూ తమ తప్పేమిలేదని చేతులు దులుపుకుంటున్నారు.
 
ఇక కోవిడ్ తర్వాత చాలా మార్పులు కథలలో వచ్చాయి. ఆ క్రమంలో హీరోలోనే విలన్ వుంటాడంటూ రెండు కోణాలను చూపించే కథలు వెండితెరపై ఆవిష్కరించారు. అలాంటి కథలే  పుష్ప 2. ఈ సినిమా కలెక్షన్లు ఉధృతి వున్నా అసలు సినిమాలో ఏముంది చెప్పుకోవడానికి, మనిషిలోని రెండో కోణం, హింస, శ్రుంగారం వంటివి చూపించి సభ్యసమాజానికి ఏమి చెప్పదలచుకున్నారంటూ ఫిలింనగర్ లోనూ చర్చించుకుంటున్నారు. పుష్ప 2 విడుదల తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా ఇకపై సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంచమని రేవంత్ రెడ్డి ఖరాఖండిగా చెప్పారు. 
 
ఆ తర్వాత ఈ సినిమాను చూసిన మల్లన్న అనే రాజకీయ నాయకుడు పుష్ప 2 సినిమాలోని హీరో పాత్ర, పోలీసు ఆఫీసర్ మధ్య జరిగే సన్నివేశాన్ని వివరిస్తూ, పోలీసులంటే ఎంత చులకనో హీరో చూపించాడు. అతని బిహేవియర్ చాలా తప్పుడు సంకేతాలను యువతపై కలిగిస్తుందని కాస్త ఘాటుగానే స్పందించారు. మరొకరు మాట్లాడుతూ, కేవలం భార్య ఫొటో అడిగితే సి.ఎం. ఇవ్వలేదనీ, ఏకంగా కోట్లు గుమ్మరించి తనకు ఫొటో ఇస్తానన్న వ్యక్తిని సి.ఎం.గా చేయడం హీరో పని ఇది వాస్తవానికి విరుద్ధం. ఇది దర్శకుడు ఐడియానో, హీరో ఐడియానోకానీ ఇలాంటి సినిమాలు భావి తరాలకు ఏమి చెప్పదలిగాచరంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి.
 
ఇక తెలంగాణా సినిమాటోగ్రఫీమంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఇకపై ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు సినిమాలకు బెనిఫిట్ షోలు, రేట్లు పెంచుకునే విధానానికి స్వస్తి పలకాల్సిందేనంటూ వ్యాఖ్యానించారు. అనంతరం సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తే అప్పుడు ఆలోచిస్తామని అన్యాపదేశంగా మాట్లాడారు. ఆయన మాటల్లో వాస్తవం వుంది. సినిమాలు సమాజానికి ఉపయోగపడాలని కొన్నేళ్ళుగా పలువురు నాయకులు, మంత్రులు ఏకరువుపెడుతూనే వున్నారు. వెంకటయ్యనాయుడు గారు కూడా సినిమా పరిశ్రమ వేడుకలకు అతిథిగా వచ్చినప్పుడల్లా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తారు. మిస్సమ్మ, నర్తనశాల, విచిత్ర కుటుంబం ఇలా ఎన్నో పేర్లను చెబుతూ ఇప్పటి దర్శక నిర్మాతలు మారాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు.
 
తాజా పరిణామల వల్ల సామాజికవేత్తలు, మేధావులు సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలని కరాఖండిగా చెబుతున్నారు. కొన్ని సినిమాలను గుర్తుచేస్తూ, అంతకుముందు అల్లు అర్జున్ తీసిన ఓ సినిమాలో సభ్యసమాజానికి ఏం సందేశం ఇవ్వాలని? అంటూ ఓ డైలాగ్ కూడా ఆయనే చెప్పారు. అదే డైలాగ్ ఆయన్ను వేలెత్తి చూపుతోంది అంటున్నారు. అసలు సినిమాలు ఇంత దారుణమైన కథలతో వుండటానికి కారణం దర్శకనిర్మాతలు, హీరోలే. ప్రశాంతంగా కుటుంబకథా చిత్రాలు, వినోదభరిత సినిమాలు తీస్తున్న దర్శకులు కొందరుంటే, మరికొందరు విదేశీ మోజుతో చిత్రమైన కథలను ఎంచుకుంటున్నారు. ఓ బేబీ అంటూ చక్కటి సినిమాలో నటించిన సమంత కూడా బాలీవుడ్‌లో ఎక్స్‌పోజింగ్, శృంగారం రంగరించిన పాత్రలో నటించింది.
 
ఇక మన తెలుగు దర్శకులు, నిర్మాతలు పూర్తిగా కమర్షియల్ బాట పట్డారు. అందులో కె. రాఘవేంద్రరావు వున్నా, కుటుంబకథా చిత్రాలతో పాటు సమాజానికి ఉపయోపడే సినిమాలు తీశారు. వినాయక్ ఆది సినిమా తీసి ఫ్యాక్టనిస్టు సినిమా తీసి బాంబుబ్లాస్ట్‌లు, రక్తపాతం తీశారు. బి.గోపాల్ ఫార్మెట్ తన దైన శైలిలో తీశారు. ఇక ఆ తర్వాత వచ్చిన సుకుమార్, బోయపాటి శీను, రామ్ గోపాల్ వర్మలు కూడా తమలోని రెండో కోణాన్ని ఆవిష్కరిస్తున్నారనే చెప్పాలి.
 
గతంలో అల్లు అర్జున్‌తో లెక్కల మాస్టర్ దర్శకుడిగా మారిన సుకుమార్, ఆర్య అనే సినిమా తీశాడు. అందులో హీరో పాత్రలో రెండు కోణాలుంటాయి. ఎవరో ప్రేమించిన అమ్మాయిని టార్గెట్ చేస్తూ అప్పటి యూత్‌ను ఆకట్టుకుని నటనలో మెప్పించారు. దానికి సీక్వెల్‌గా దర్శకుడు సుకుమార్ ఆర్య2 కూడా  తీశాడు. ఆ చిత్రం చూశాక చాలామంది మేధావులు ఇలాంటి కథలేమిటి? సుకుమార్ పైత్యం ఇందులో చూపించాడంటూ విమర్శించారు. ఇక 100 పర్సెంట్ లవ్ సినిమా కాస్త సభ్యతగా వుంది. రంగస్థలం సినిమా మాస్ సినిమా. అలా చేసుకుంటూ పుష్ప వంటి ఎర్రచందనం స్మగ్లర్ సినిమాను దొంగను హీరోగా చూపించడం ద్వారా సభ్యసమాజానికి ఏమి చెబుతున్నాడంటూ ఇప్పుడు రాజకీయనాయకులు కూడా వేలెత్తి చూపుతున్నారు. గతంలో చిరంజీవి, ఎన్.టి.ఆర్.కానీ దొంగ పేర్లతో చేసిన సినిమాలు ఇంత దారుణంగా చూపించలేదని విశ్లేషకులు తెలియజేస్తున్నారు. 
 
మరోవైపు బోయపాటి శీను ఫ్యాక్షన్ సినిమాలంటూ రక్తపాతాలు, బాంబ్ బ్లాస్ట్‌లు చూపిస్తూ హింసను పురిగొల్పే కథలనే నమ్ముకున్నాడు. ఇంకోవైపు రామ్ గోపాల్ వర్మ పైత్యానికి పరాకాష్టగా తనకు నచ్చిన దెయ్యం, భూతం లేదంటే శృంగార సినిమాలు తీస్తూ నాకు నచ్చింది తీస్తా చూస్తే చూడండి లేదంటే లేదు అంటూ తన మేధావితనాన్ని ప్రదర్శించాడు.
 
రానురాను సినిమా అనేది టెక్నికల్‌గా ఎంతో మారింది. అయినా సరే కథల ఎంపికలో తనదైన జాగ్రత్తలు తీసుకుని కుటుంబంతో కలిసి చూసేలా చేస్తున్న దర్శకుల్లో రాజమౌళి అగ్రభాగంలో వున్నారు. చిన్నప్పుడు అందరూ చదివిన చందమామ, బొమ్మరిల్లు కథలను ఇప్పటి తరానికి అర్థమయ్యేలా హాలీవుడ్ స్థాయిలో చూపిస్తూ బాహుబలి, ఆర్.ఆర్.ఆర్. అంటూ కాల్పినిక లోకంలో తీసుకెళ్ళి సక్సెస్ అయ్యాడు. నాగ్ అశ్విన్ కూడా మహానటి, కల్కి వంటి మంచి సినిమాలు తీసి మెప్పించారు. ఈ సినిమాల వల్ల సమాజానికి చేటు లేదు. అందుకే ఈ తరహా సినిమాలు తీయాలంటూ ఇటీవలే తెలంగాణ సినిమాటోగ్రఫీ కూడా తెలియజేయడం విశేషం.
 
ఇప్పటికే అర్జున్ రెడ్డి పేరుతో సందీప్ రెడ్డి వంగా చేసిన ప్రయోగం సక్సెస్ కావడతో ఇదే కరెక్ట్ అనుకుని పలువురు ఆ మార్గంలో వెళ్ళారు. అందులో అంశాలు కుటుంబంతో కలిసి చూసేట్లుగా వుండవు. కానీ ఇవన్నీ అందరికీ తెలిసిందే సమాజంలో ఇలాంటి వారు వున్నారంటూ తనశైలిలో దర్శకుడు సమర్థించుకున్నాడు. ఇటీవలే విడుదలైన డ్రింక్ సాయి కూడా ఇంచుమించు అటువంటిదే. 
 
అందుకే సినిమాలు ఏ తరహా తీయాలో అనేది కూడా ప్రభుత్వపరంగా వున్న సెన్సార్ బోర్డ్ కూడా కొన్ని నిబంధనలు చేయాల్సిన అవసరం ఎంతైనా వుందని ఇటీవలే కొందరు మేధావులు సినిమాటోగ్రఫీ ముందుకు తీసుకువచ్చారు. ఆ పనిని ఎఫ్.డి.సి. ఛైర్మన్ దిల్ రాజుకు అప్పగించారని సమాచారం. అతను ఎలాగూ కుటుంబకథా చిత్రాలు తీస్తాడు కాబట్టి అతనే సరైన వ్యక్తని సినీ పెద్దలు భావిస్తున్నారు. మరి సినిమాల్లో తెలుగుదనం కూడా లోపిస్తుంది. ఆ కోణంలో కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు