ఆరంభం అదిరింది. కేన్స్ వంటి అంతర్జాతీయ చిత్ర సంబరాల వేదికపై సంఘమిత్ర ఫస్ట్ లుక్‌ను దర్శకుడు సుందర్.సి ఆట్టహాసంగా విడుదల చేశారు. అమరచిత్రకథలో సాహస నారిలను పోలిన ఆహార్యంతో పదవ శతాబ్ది చారిత్రక ఇతివృత్తంలో సంఘమిత్రగా శ్రుతిహసన్ ఫస్ట్ లుక్ నిజంగానే కేన్స్ ఫెస్టివల్‌లో మెరిసింది. స్వీట్ అండ్ ఇన్నోసెంట్, లేదంటే... బ్యూటిఫుల్ అండ్ బబ్లీ హీరోయిన్‌గా ఎక్కువ శాతం సినిమాల్లో నటించిన శ్రుతి వారియర్ ప్రిన్సెస్‌గా ‘సంఘమిత్ర’లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్‌లో కనిపించనున్నారు. ఇదైతే... జస్ట్ లుక్కే. కానీ, కత్తితో శ్రుతి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందోననే ఊహే ప్రేక్షకులకు కిక్ ఇస్తోంది.
కానీ ఫాంటసీ చిత్రాల్లో ఇదివరకు కూడా నటించిన శ్రుతిహసన్ యుద్ధాలు చేయని హీరోయిన్‌గా నటించారు కానీ ఫలితం ఆశించినట్లుగా రాలేదు. తెలుగులో ‘అనగనగా ఒక ధీరుడు’, తమిళంలో ‘పులి’ ఈ రెండు సోషియో ఫాంటసీ ఫిల్మ్స్‌లో నటించిన శ్రుతిహసన్ దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఈ ‘సంఘమిత్ర’లో ఆమె టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు.
ఫస్ట్ లుక్ చూస్తుంటే శత్రువుల లెక్కలు సరిచేయడంలో శ్రుతి ఏమాత్రం ఛాన్స్ తీసుకోరని అర్థమవుతోంది కదూ! ఈ సినిమా కోసం లండన్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ అండ్ ఇతర యుద్ధ విద్యల్లో శ్రుతి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. శ్రుతితో పాటు ఇందులో హీరోగా నటిస్తున్న ఆర్య లుక్‌ను కూడా కేన్స్‌లో విడుదల చేశారు.
బాహుబలి స్ఫూర్తిగా తమిళ, హిందీ, తెలుగు భాషల్లో తీస్తున్న సంఘమిత్ర కాల్పనిక గాథ కాదు. శత్రువులనుంచి రాజ్యాన్ని కాపాడుకోవడంలో పది శతాబ్దాల క్రితం అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన వీరనారి సంఘమిత్ర. అలనాటి ఆ వీరత్వాన్ని, శౌర్య ప్రవృత్తిని హావభావాల్లో చూపటం అంటే నాలుగు పాటలు పాడేసి తన పని అయిపోయిందని చెప్పి వెళ్లిపోతే సరిపోదు.
సినిమా టేకింగ్‌లో అపార ప్రతిభ కలిగిన దర్శకుడు సుందర్ సంఘమిత్రగా శ్రుతిహసన్ ఏమేరకు ఎలివేట్ చేయగలడన్నదే అసలు విషయం. బాహుబలి ప్రేరణతో తీస్తున్న సంఘమిత్రపై ఎలాంటి హైప్ క్రియేట్ అవుతుందో చెప్పనవసరం లేదు. శ్రుతి తన పాత అనుభవాన్ని పక్కనపెట్టి సంఘమిత్రకు ప్రాణం పోస్తుందా.. లేక తెలుగులో ‘అనగనగా ఒక ధీరుడు’, తమిళంలో ‘పులి’లాగే విఫల చరితగా నిలిచిపోతుందా..
సంఘమిత్రకు ఏమవుతుందో తెలియాలంటే మరి కొద్దినలలు ఆగాల్సిందే మరి.