ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి. రూపొందిస్తున్న సంగమిత్ర సినిమా ఫస్ట్‌లుక్ నిజం చెప్పాలంటే మతి పోగొడుతోంది. గురువారం చిత్రబృందం విడుదల చేసిన సినిమా పస్ట్‌లుక్ చూస్తుంటే భారతీయ సినిమాపై బాహుబలి వేసిన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇకపై భారతీయ సినీ పరిశ్రమ ఏ సినిమా తీయాలన్నీ, ప్రత్యేకించి చారిత్రక, పౌరాణిక, ఫాంటసీ చిత్రాలు తీయాలంటే బాహుబలి 2 ని దృష్టిలో పెట్టుకుని కాస్త భయంతోనే వ్యవహరించాలని సంఘమిత్ర ఫస్ట్ లుక్ తేల్చి చెబుతోంది. సంగమిత్ర పాత్రధారి శ్రుతిహసన్ ఈ ఫస్ట్ లుక్‌లో మెరుపులా మెరుస్తోందంటే అతిశయోక్తి కాదు.
ఒక సినిమా సాధించిన అఖండ విజయాన్ని గౌరవించాలంటే ఆ సినిమాతో పోటీ పడే శక్తిని, స్థాయిని ప్రదర్శించాల్సిందే అన్న సత్యాన్ని గుర్తు చేస్తూ సంగమిత్ర దర్శకుడు సుందర్ సి. అద్భుతరీతిలో ఫస్ట్ లుక్‌ను రూపొందించారు. బాహుబలి బాలీవుడ్ సమర్పకుడు కరణ్ జోహార్ నెల క్రితం చెప్పిన విషయం ఇదే. భారతీయ సినిమాకు బాహుబలి-2 కొత్త విజన్‌ని ఇస్తోందని కరణ్ అన్న మాట అక్షరసత్యంగా సంగమిత్ర ఫస్ట్ లుక్ ద్వారా కనబడుతోంది.
శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలో తమిళ దర్శకుడు సుందర్.సి రూపొందిస్తున్న చిత్రం ‘సంగమిత్ర’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. త్రెండాల్ ఫిల్మ్స్ దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ యువరాణి పాత్రలో కన్పించనుంది. ఇందుకోసం ఆమె ఇటీవల కత్తిసాములో సైతం శిక్షణ తీసుకుంటోంది. ఇక ఈ సినిమాలో ఆర్య, జయం రవి కూడా నటిస్తున్నారు.
ఈ చిత్రం ‘బాహుబలి’ తరహాలో రెండు భాగాలుగా రూపొందిస్తారని సమాచారం. ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించబోతున్నారు.