ప్రపంచం మొత్తం కరోనా గుప్పిట్లో ఉంది. ఈ వైరస్ మరింత మందికి సోకకుండా ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు. దీంతో ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. అయితే, సెలెబ్రిటీలు మాత్రం తమతమ ఇళ్ళలో ఉంటూ, కరోనా వైరస్ వ్యాపించకుండా, ప్రజల్లో అవగాహన కల్పించేలా వీడియోలు తీస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార గోల్డెన్ రూల్స్ పేరుతో కరోనా బారినపడకుండా ఉండేందుకు ఐదు చిట్కాలను చెప్పింది. అంటే కరోనాపై అవగాహన పెంచే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. గోల్డెన్ రూల్స్, పిల్లలు చెప్పిన మాటలు వినండని కామెంట్ పెట్టారు.
ఈ వీడియోలో ముందుగా దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోలేకపోవడం వంటివి కరోనా లక్షణాలుగా చెబుతూ, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని కోరింది. ఆ తర్వాత 5 సూత్రాలు తప్పక పాటించాలని స్పష్టం చేసింది.
మొదటి సూత్రం ప్రకారం ఇంట్లో ఉండి, సామాజిక దూరం తప్పక పాటించాలి. రెండోది చేతులని 30 సెకన్ల పాటు తరచూ శుభ్రపరచుకోవాలి. మూడోది దగ్గు, లేదా తుమ్ములు వచ్చినప్పుడు మోచేతిని అడ్డుపెట్టుకోవాలి. నాలుగోది మీ చుట్టు పక్కల వారికి మూడు మీటర్ల దూరం తప్పక పాటించాలి. ఐదోది మీ చేతితో కన్ను, నోరు, చెవులని తాకరాదు. ఇంట్లో ఉండండి. కరోనాని తరిమి కొట్టండని సితార వీడియో ద్వారా తెలియజేసింది.