ఇదంతా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నాల్లో భాగమని తెలియజేస్తున్నారు. అందరూ ఒక్కతాటిపై రావాలని పిలుపుఇస్తున్నారు. ఈ చట్టం అమలు జరిగితే కథలలో మార్పు వస్తందనీ, రాజకీయ నాయకుల తప్పుల్ని వేలెత్తి చూపించకుండా వారు చెప్పిందే వేదమనేలా వుంటుందని ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని అంటున్నారు.
ఈ చట్టంపై తెలుగు సినీ పరిశ్రమ ఇంతవరకు ఎటువంటి స్పందన చేయలేదు. మెగాస్టార్ నుంచి కింది స్థాయి హీరోలుకానీ, దర్శక నిర్మాతలుకానీ ఏమాత్రం దీని గురించి ఆలోచిస్తున్నట్లు లేదు. ప్రస్తుతం థియేటర్ ఎలా ఓపెన్ చేయాలనేదానిపైనే ఈనెల 7న ఫిలింఛాంబర్‌లో సినీ పెద్దలు సమావేశం కానున్నారు. మరి ఆ సమయంలో ఈ చట్టంపై ఎవరైనా కదిలిస్తే స్పందిస్తారేమో చూడాలి.
1983నాటి సెన్సార్ నిబంధనలే
సినిమా విడుదలకుముందు సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ 1983లో చేసిన సవరణలకు అనుగుణంగా ఉంది. తల్లిదండ్రుల అనుమతితో 12 ఏళ్ల లోపు వారు సినిమా చూసే అవకాశం ఆ సర్టిఫికెట్ ఇస్తుంది. అయితే దీనికి మార్పులు చేసి 7 ఏళ్లు, 13 ఏళ్లు, 16 ఏళ్లు పైబడిన వారు కూడా చూసేలా,మూడు విభాగాలుగా విభజించింది. సర్టిఫికేషన్ కాలపరిమితి 10 ఏళ్లు చెల్లుబాటు ఉండగా ఉత్తర్వుల ద్వారా ఆ కాలపరిమితిని రద్దు చేశారు. దానికి అవసరమైన చట్ట సవరణలను చేయనున్నట్లు తెలిపింది. కొత్తగా ప్రవేశ పెట్టనున్న సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లును వెట్రిమారన్, ఆనంద్ పట్వర్ధన్ వంటి పలువురు చిత్ర నిర్మాతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడున్న కమిటీల్లో కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వ ఆసక్తిని కాపాడటానికి కొంతమంది బోర్డు సభ్యులు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ముందు ముందు ఏరూపంలో ఈ చట్టం దారితీస్తుందో చూడాలి. దీనిపై జాతీయస్థాయిలోని నటీనటులు స్పందించాల్సిన అవసరం ఉందని కమల్ హాసన్ తెలియజేస్తున్నారు.