ఒక్క రాత్రిలో ప్రభాస్ జాతీయ హీరో అయిపోయినట్లే అనుష్క కూడా అందాల యువరాణిగా సమస్త భారతీయుల మనసు దోచింది. బాహుబలి-2 సినిమా విడుదలోతో కెరీర్ పీక్ స్టేజ్‌కి వెళ్లిపోయిన అరుదైన అవకాశం ఈ ఇద్దరికే ఇచ్చింది. దర్శకుడు రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలిలో కత్తి చేతబట్టి దేవసేన పాత్రలో ఒదిగిపోయింది. దక్షిణ భారతదేశంలో పన్నెండేళ్ల చిత్ర రంగ కెరీర్‌లో కఠిన శ్రమతో, క్రమశిక్షణతో, నటనతో సాధించిన ఘనతను, కీర్తి ప్రతిష్టలను ఉత్తరాదిలో ఒకే ఒక్క సినిమాతో కొల్లగొట్టేసింది అనుష్క. యువరాణిగా ఆమె చూసిన రాజసం, అంతకు మించి ప్రదర్శించిన అద్భుత సౌందర్యం, మాహిష్మతి రాజమాత శివగామిని ధిక్కరించిన ఆత్మాధిక్యతతో ఉత్తరాది ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.
రెండో భాగం విడుదలైన తొలి రోజునుంచి ప్రభాస్ ఉత్తరభారత స్టార్ హీరోగా అయినట్లే అనుష్కను కూడా హిందీ ప్రాంత ప్రేక్షకులు తమ గుండె గదిలో దాచుకుని గౌరవించారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఒక హీరోయిన్‌ను సెక్సప్పీల్‌తో కాకుండా అత్యంత గౌరవభావంతో ఆరాధిస్తుండటం మహానటి సావిత్రి తర్వాత అనుష్క విషయంలోనే సాధ్యమయిందని సినీ పరిశ్రమ విజ్ఞుల ఉవాచ.
దేవసేన పాత్రతో తన జీవితపర్యంతం మిగిలి ఉండే గుర్తింపును సంపాదించిన అలాంటి అనుష్క చేతిలో ఇపుడు ఒక్క చిత్రం మినహా వేరే అవకాశాలు లేవనే చెప్పాలి. ప్రభాస్ తాజా చిత్రం సాహోలోనూ కథానాయకి తానే అన్న ప్రచారం జరుగుతున్నా అది ఊహాగానమే. బాహుబలి-2 వంటి ఘనవిజయం తరువాత కూడా అనుష్కకు కొత్త అవకాశాలు రాకపోవడం ఏమిటి అవకాశాలు రావడంలేదా వస్తున్న వాటిని తిరస్కరిస్తోందా అనేది ఆసక్తికరమైన ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ఇలాంటి ప్రచారాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది బాహుబలి బ్యూటీ, స్వీటీ.
ప్రస్తుతం భాగమతి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు అనుష్క. అశోక్.జి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంతో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. ఇందులో యువ నటుడు ఆది పినిశెట్టి ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీత బాణీలు కడుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రమోద్, వి.వంశీకృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పుడు పొల్లాచ్చిలో చిత్రీకరణను జరుపుకుంటోంది. చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుందని సమాచారం.
భాగమతి తప్ప మరే చిత్రాన్నీ సైన్ చేయని అనుష్క పెళ్లి వైపే మొగ్గు చూపుతోందా.. ఒక్క సంవత్సరం చిత్ర రంగ కెరీర్ అనుభవంతో ఇక చాలు బాబో అంటూ పారిపోవాలనుకున్న అనుష్క 12 ఏళ్లుగా దక్షిణాది చిత్రసీమను ఏలుతోంది. ఆమె నిజంగా పెళ్లికి మొగ్గు చూపినా ఆమె నిర్ణయాన్ని అందరూ గౌరవించాల్సిందే. ప్రభాస్‌తో ఆమె పెళ్లి అంటూ వస్తూన్న వార్తలను ఇక అందరం మర్చిపోదాం. అది జరగని పని అని తేలిపోయింది. సినిమా ఆనంతరం ఆమె జీవితం చల్లగుండాలి అని కోరుకోవడం తప్ప ఆమె గురించి ఇక ఏమాత్రం పుకార్లు రేపవద్దు అంటున్నారు విజ్ఞులు.