బాలీవుడ్ నటి సుస్మితా ట్రాన్స్‌జెండర్ (హిజ్రా)గా అవతారమెత్తారు. జాతీయ అవార్డు దర్శకుడు రవి జాదవ్ తెరకెక్కిస్తున్న విభిన్న కథా వెబ్ సిరీస్ తాళిలో ఆమె హిజ్రా పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఈ నెల 15వ తేదీ నుంచి టెలికాస్ట్ కానుంది. హిందీ, తెలుగుతో పాటు, దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రంలో చెప్పారు. ట్రాన్స్‌జెండర్ పాత్రలో సుస్మిత నటన, హావభావాలు సిరీస్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి. హిజ్రాల హక్కుల పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్లు తెలుస్తోంది.
దీనిపై సుస్మితా సేన్ స్పందిస్తూ, "నా దగ్గరకు ఈ కథ రాగానే మరో ఆలోచన లేకుండా వెంటనే అంగీకరించాను. అయితే, హిజ్రా పాత్ర కోసం సన్నద్ధం కావడానికి ఆరున్నర నెలల సమయం పట్టింది. ఒక ప్రత్యేకమైన పాత్ర చేస్తున్నప్పుడు అందుకోసం కొంత పరిశోధన కూడా అవసరం. హిజ్రా హక్కుల కోసం పోరాటం చేసిన శ్రీగౌరి సావంత్ ప్రశంసించదగిన వ్యక్తి. వివిధ కోణాల్లో ఆమె నాకు ఎంతో కనెక్ట్ అయ్యారు. ఈ సిరీస్ కోసం ఆమెతో కలిసి కొన్ని రోజులు ఉండటం నాకు దక్కిన అదృష్టం" అంటూ చెప్పుకొచ్చారు.