తమిళనాడును తమిళ వ్యక్తే పాలించాలనీ, సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశం చేస్తానంటే తాను తీవ్రంగా ప్రతిఘటిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మరో తమిళ నటుడు, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్ కుమార్ మాట మార్చారు. తన మాటలను మీడియా సమావేశానికి రాని వెబ్‌సైట్ ప్రతినిధులు, సోషల్ మీడియా వక్రీకరించాయన్నారు.
చెన్నైలో జరిగిన తుగ్లక్ పత్రిక వార్షికోత్సవంలో శరత్ కుమార్ మాట్లాడుతూ సినీనటుడు రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే అడ్డుకుంటామని, ఆయనకు ప్రజల బాధల గురించి తెలియవని వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆగ్రహించిన రజినీకాంత్ అభిమానులు శరత్ కుమార్ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో శరత్ కుమార్ మరోమారు మీడియా ముందుకొచ్చారు.
తనకు రజినీతో ఎలాంటి విభేదాలూ లేవన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని, అసలు తాను రజినీకాంత్కు రాజకీయ పార్టీ పెట్టే అర్హత లేదని అనలేదని వివరణ ఇచ్చారు. రజినీకాంత్ గురించి తనంతట తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు. రజినీకాంత్ తనకు స్నేహితుడేనని చెప్పిన ఆయన.. ఒకవేళ రజినీ పార్టీ పెడితే మాత్రం ఆయనను ప్రత్యర్థిగా భావిస్తానని చెప్పారు. తమిళనాడు రాష్ట్రాన్ని పాలించే వారు జన్మతః తమిళులే అవ్వాలన్నది తన ఉద్దేశమని శరత్ కుమార్ వివరణ ఇచ్చారు.