మెగా డైరెక్టర్ కన్నుమూత.. విజయబాపినీడు ఇకలేరు...

మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (12:32 IST)
టాలీవుడ్ మెగా డైరెక్టర్లలో ఒకరైన విజయబాపినీడు ఇకలేరు. ఆయన మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 82 యేళ్లు. ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, చిరంజీవి సినీ కెరీర్‌కు ఓ వెన్నుముకలా ఉన్నారు. 
 
1936 సెప్టెంబర్ 22న చాటపర్రులో జన్మించిన బాపినీడు అసలు పేరు గుట్టా బాపినీడు చౌదరి. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత తన పేరును విజయబాపినీడుగా మార్చుకున్నారు. తన కుమార్తెలు నిర్మించిన 'కొడుకులు' చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. బాపినీడు ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవితోనే సినిమాలు రూపొందించారు.
 
చిరంజీవి నటించిన 'మగమహారాజు'తో దర్శకుడిగా మారిన బాపినీడు.. అనంతరం 'మహానగరంలో మాయగాడు', 'మగధీరుడు', 'ఖైదీ నంబర్ 786', 'గ్యాంగ్ లీడర్', 'బిగ్ బాస్' వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్లను ఇచ్చారు.

అలాగే, రాజాచంద్ర, దుర్గా నాగేశ్వరరావు, జి.రామమోహనరావు, మౌళి, వల్లభనేని జనార్థన్ వంటి వారిని దర్శకులుగాను, పాటల రచయితగా భువనచంద్రను, మాటల రచయితగా కాశీ విశ్వనాథ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. విజయబాపినీడు మృతిపట్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు