నటిగా విజయనిర్మల జీవితం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. మరోవైపు దర్శకురాలిగా రాణిస్తూ గిన్నిస్ బుక్ లో పేరు సంపాదించుకుంది. ఆమె జయంతి నేడే. పుట్టిన తేదీ: 20 ఫిబ్రవరి, 1946న ఆమె పుట్టారు. విజయనిర్మల పుట్టిల్లు నరసరావుపేట. విజయనిర్మల తల్లి శకుంతల, అన్నలు వసంతరావు, సంజీవరావు పాతూరులో వీరి కుటుంబాలన్నీ ఉండేవి.
విజయనిర్మల బాల్యం అత్యధిక కాలం పాతూరులోనే గడిచింది. రాజాగారి కోటలోని విక్టోరియా హాల్లో ఆమె చిన్నతనంలో నృత్య ప్రదర్శన కూడా ఇచ్చింది. తదనంతర కాలంలో విజయనిర్మల తల్లిదండ్రులతో కలిసి చెన్నై వెళ్లిపోయారు. ఈమె అసలు పేరు నిర్మల అయితే తనకు సినీరంగములో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియోకు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకొన్నది. అప్పటికే ఇదే పేరుతో వేరే నటి ( నిర్మలమ్మ) ఉండడం కూడా పేరు మార్పునకు మరో కారణము.
సినిమారంగం
పాండురంగ మహత్యంలో బాలనటిగా చిత్రరంగంలో ప్రవేశించారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి కథానాయకిగా ఉన్నత స్థానానికి చేరారు. తరువాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా 2002లో గిన్నిసుబుక్‌లో ఎక్కారు. నటి అయిన ఈమె 1971లో దర్శకత్వము వహించడము ప్రారంభించింది. ఈమె నటించిన అధిక చిత్రాలలో కథానాయకుడు కృష్ణ కావటం విశేషం. వీరిద్దరూ జంటగా సాక్షి నుంచి నేరము శిక్ష వరకు దాదాపు 48 సినిమాలో చేశారు. రఘుపతి వెంకయ్య పురస్కారానికి ఎంపికయ్యారు.
దర్శకురాలిగా
సాక్షి సినిమా నుంచే బాపుగారి దగ్గర స్టోరీ బోర్డ్ ఆసక్తిగా గమనించేవారు. లాంగ్ షాట్, క్లోజ్ షాట్స్, మిడ్ షాట్స్ అంటే ఏమిటో ఆసక్తిగా అడిగి తెలుసుకొనేవారు. నటిగా నిలదొక్కుకుంటున్న సమయంలోనే దర్శకత్వం గురించి కృష్ణగారితో పంచుకుంటే ఈ దశలో నటన, దర్శకత్వం రెండూ పడవల ప్రయాణం వద్దు కొంత కాలం ఆగు`అంటూ హితవు పలికారు. దాంతో నటిగా 100 సినిమాలూ పూర్తి చేసిన తర్వాత దర్శకురాలిగా మారారు. మొదట ఆమె `కవిత` సినిమాకు దర్శకత్వం వహించారు. కానీ అది మలయాళ సినిమా కావడంతో తెలుగులో లెక్కలోకి రాలేదు.
మీనా సినిమాతో...
ఆ రోజుల్లో ప్రముఖ వారపత్రికలో యద్దనపూడి సులోచనారాణి నవల `మీనా` సీరియల్‌గా వచ్చేది. కేవలం నాలుగు పాత్రల చుట్టూ తిరిగే కథ ఆమెను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అది ఇప్పటికీ మర్చిపోలేని సినిమాగా వుందనడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన `అఆ`నే నిదర్శనం. ఆ సినిమానే మార్చి తీశాడు.
ఇక మీనా సినిమా గురించి పి. పుల్లయ్యగారితో పాటు పలువురు ప్రముఖులు మంచి కామెంట్లు చేశారు. ఇప్పటి వరకు ఎన్నో తెలుగు నవలలు సినిమాలుగా రూపుదిద్దుకున్నాయి. కానీ వాటికి తగిన న్యాయం జరగేలదు. దర్శకురాలు విజయనిర్మల మాత్రం `మీనా`కు పూర్తి న్యాయం చేసిందని వెల్లడించారు పుల్లయ్యగారు.
కృష్ణగారితో
ఇక కృష్ణగారితో ఆమె జీవన ప్రయాణం ఆమె కెరీర్‌ను మార్చేసింది. తొలుత ఆయనతో నటిస్తూనే విజయాలు రావడంతో పాటు సెంటిమెంట్‌గా కలిసి రావడం, ఆమె మనస్సు మంచిదని గ్రహించి పరిశ్రమలోని పెద్దల సహకారంతో ఒకటి అయ్యారు. అయినా ఆ తర్వాత ఒప్పందం ప్రకారం పిల్లలు లేకుండా జాగ్రత్త పడ్డారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన విజయనిర్మల ముందుచూపుతో హైదరాబాద్ శివార్లోని నానక్‌రామ్‌గూడాకు అవతం 10 ఎకరాల స్థలాన్ని 30 ఏళ్ళ క్రితమే తీసుకున్నారు. అది అప్పుడు ప్లానెట్ 10 అనేవారు.
క్రమేణా నగరం విస్తరించి గచ్చిబౌలి నిర్మాణం జరగడంతో సాఫ్ట్‌వేర్ కంపెనీలు నెలకొలడంతో వేలకోట్ల రూపాయలకు ఆస్తులు చేరాయి. ప్రస్తుతం కృష్ణగారు అక్కడే వుంటున్నారు. విజయనిర్మల కుమారుడు నటుడు సీనియర్ నరేశ్ కూడా అక్కడే వుంటున్నారు. ఆమె మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల్లో పేద కళాకారులకు ప్రతి పుట్టినరోజున ఆమె వయస్సుకు తగినట్లు డొనేషన్ ఇచ్చేవారు. ఇవేకాకుండా ఎన్నో సేవాకార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచేవారు. ఆమె దగ్గరకు వచ్చిన ఎవరినైనా భోజనం పెట్టకుండా పంపేవారు కాదు. నేడు ఆమెను తలచుకోవడం సమంజసం. భానుమతి తర్వాత మహిళా దర్శకురాలిగా విజయనిర్మల స్థానం పదిలంగా వుంటుందనే చెప్పాలి.