ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాటల్లో పెద్ద బాంబ్ వుంది - స‌మంత అంటే చాలా ఇష్టం - ఐశ్వ‌ర్యా రాజేశ్‌

సోమవారం, 27 సెప్టెంబరు 2021 (13:46 IST)
Aishwarya Rajesh
సాయితేజ్ హీరోగా న‌టించిన పొలిటికల్ థ్రిల్ల‌ర్ ‘రిప‌బ్లిక్‌’. దేవ క‌ట్టా ద‌ర్శ‌కుడిగా జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించారు. ‘రిప‌బ్లిక్‌’ గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 1న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా నాయిక ఐశ్వ‌ర్యా రాజేశ్ చిత్రం గురించి, వ్య‌క్తిగ‌త అభిరుచులు గురించి ప‌లు విష‌యాల‌ను తెలియ‌జేసింది.
 
- మేం ఉండేది చెన్నైలోనే అయితే ఆహారంతినే ప‌ద్ద‌లు అన్నీ మ‌న తెలుగువాళ్ల‌లాగానే ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు త‌మిళులు సాంబార్‌లో కూర‌లు క‌లుపుకుని తింటారు. కానీ మ‌న తెలుగువాళ్లు అన్నంలో క‌లుపుకుని తింటారు. మేం ఎప్పుడైన ఫంక్ష‌న్స్‌కు వెళ్లిన‌ప్పుడు మ‌న స్టైల్లో తింటుంటే విచిత్రంగా చూస్తుంటారు.
 
- నేను చేప‌లు పులుసు, చికెన్ కూర బాగా చేస్తాను. మిగ‌తా వంట‌ల‌ను కూడా బాగా చేస్తాను. 
 
- ఓ రోజు దేవ‌క‌ట్టాగారు ఫోన్ చేసి రిప‌బ్లిక్ సినిమా గురించి చెప్పి మైరా పాత్ర ఉంద‌ని చెప్పారు. ఆయ‌న బేసిగ్గా హీరో, హీరోయిన్ అని కాకుండా క్యారెక్ట‌ర్స్‌, దాని ప్రాధాన్య‌త‌లేంటి? అని చూస్తారు. ఆయ‌న నాకు ఫోన్ చేసిన‌ప్పుడు కరోనా కార‌ణంగా ఫోన్‌లోనే స్క్రిప్ట్ గంట పాటు వివ‌రించారు. హైద‌రాబాద్ వ‌చ్చి క‌లిసిన త‌ర్వాత ఐదారు గంట‌ల పాటు స్క్రిప్ట్ నెరేట్ చేశారు.
 
- దేవాగారికి త‌ను చేసే సినిమాపై ప‌క్కా క్లారిటీ ఉంటుంది. నా పాత్ర విష‌యానికి వ‌స్తే నేను ఇందులో ఎన్నారై అమ్మాయిగా క‌నిపిస్తాను. ఓ స‌మ‌స్య కార‌ణంగా విదేశాల్లో ఉండే నా పాత్ర ఇండియాకు వ‌స్తుంది. 
-రొటీన్‌గా సాంగ్స్ పాడుకునేలా ఇందులో హీరో, హీరోయిన్ మ‌ధ్య ల‌వ్‌ట్రాక్ ఉండ‌దు. మెచ్యూర్డ్‌గా క‌నిపిస్తుంది. సినిమాలో ప్ర‌పోజ్ చేసే సీన్ కూడా ఉండ‌దు.
 
- ఇది కేవ‌లం హీరో హీరోయిన్ సినిమా కాదు.. సాయితేజ్‌, నాతో పాటు జ‌గ‌ప‌తిబాబుగారు, ర‌మ్య‌కృష్ణ‌గారు ఇత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపిస్తాం. ప్ర‌తి పాత్ర‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది.\
 
- తెలుగులో సినిమాలు వ‌స్తున్నాయి. పెర్ఫామెన్స్‌కు ప్రాధాన్యం ఉండే పాత్ర‌లైతే చేద్దామ‌ని వెయిట్ చేస్తున్నాను. విజ‌య్ దేవ‌రకొండ‌గారి డియ‌ర్ కామ్రేడ్‌లో సువ‌ర్ణ పాత్ర‌లో న‌టించాను. సినిమా బాగా ఆడ‌క‌పోయినా పాత్ర చ‌క్క‌గా అంద‌రికీ రీచ్ అయ్యింది క‌దా.
 
- రిపబ్లిక్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ కాదు.. డిఫ‌రెంట్ మూవీ. రియ‌ల్ స్టోరిని తీసుకుని బ‌ల‌మైన  ప్లాట్‌ను బేస్ చేసుకుని దేవ క‌ట్టాగారు సినిమాను తెర‌కెక్కించారు. ప్ర‌తిదీ హండ్రెడ్ ప‌ర్సెంట్ ఉండాల‌నుకునే వ్య‌క్తి ఆయ‌న‌. సినిమాకు 22 రోజులు వ‌ర్క్ చేశాం. డ‌బ్బింగ్ చెప్ప‌డానికి 15 రోజుల స‌మ‌యం ప‌ట్టింది. అంటే డైరెక్ట‌ర్‌గారు ఎంత ప‌ర్‌ఫెక్ష‌న్ కోరుకున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.
 
- సినిమా అనేది మ‌న జీవితాల్లో ప్ర‌భావాన్ని చూపిస్తుంటుంది. అందుకే మ‌నం సినిమా చూసిన‌ప్పుడు ఏదో ఒక పాయింట్‌కు క‌నెక్ట్ అవుతుంటాం. అలాంటి ఓ బ‌ల‌మైన సినిమా మాధ్య‌మంలో స‌మాజానికి అవ‌స‌ర‌మైన ఓ విష‌యాన్ని వివ‌రిస్తూ తెర‌కెక్కించారు.
 
- నాకు రాజ‌కీయాలు పెద్ద‌గా తెలీవు. ఫంక్ష‌న్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడాక‌, ఇక్క‌డ పెద్ద బాంబ్ వుంద‌ని అర్థ‌మ‌యింది. విదేశాల్లో విద్యార్థుల‌కు రాజ‌కీయాల గురించి చెబుతారు. మ‌న ఇండియాలో ఆ ప‌ద్ధ‌తి లేదు. అందుకే రాజ‌కీయ వ్య‌వ‌స్థ ఇలా వుంది..
 
- డిఫ‌రెంట్ సినిమా అనిపిస్తే అందులో చిన్న రోల్ అయినా చాలు చేయ‌డానికి న‌టిస్తాను. మ‌న పాత్ర ద్వారా అంద‌రికీ గుర్తుండిపోవాల‌ని భావిస్తాను.
 
- సాయితేజ్ ఓ జెమ్‌. ఈ సినిమా కోసం చాలా ఎఫ‌ర్ట్ పెట్టారు. సినిమాలో ప్ర‌జ‌లు త‌రపున మాట్లాడే పాత్ర‌లో త‌ను న‌టించాడు. సినిమా షూటింగ్‌కు వెళ్ల‌డానికి ముందుగానే నేను యూనిట్‌ను క‌లిశాను. నేను, తేజ్‌, దేవ‌క‌ట్టాగారు.. ఇలా అంద‌రూ డిస్క‌స్ చేశాం. తేజ్ ప్ర‌తిరోజూ స్కూల్‌కు వెళ్లే పిల్లాడిలా ఉద‌యం ప‌దిన్న‌ర‌కంతా వ‌చ్చేవాడు. ఓ బుక్ పెట్టుకుని అందులో డైలాగ్స్ రాసుకుని ప్రాక్టీస్ చేసేవాడు. ఎంత క‌ష్ట‌ప‌డ్డారంటే ఇందులో కోర్టు రూమ్ సీన్ ఉంది. ప‌ది నిమిషాల పాటు సాగే ఆ సీన్‌ను తేజ్ సింగిల్ టేక్‌లో చేశాడు. ఆ సీన్ త‌ర్వాత యూనిట్ అంద‌రూ క్లాప్స్ కొట్టారు. త‌న కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుంద‌ని నేను భావిస్తున్నాను. 
 
- సినిమా ఇండ‌స్ట్రీ చాలా మారింది. కొత్త ద‌ర్శ‌కులు వ‌స్తున్నారు. రీసెంట్‌గా ఓ సంద‌ర్భంలో బుచ్చిబాబుగారిని క‌లిశాను. మీ వ‌ర్కింగ్ స్టైల్ బావుంటుంది. మీతో వ‌ర్క్ చేయాల‌నుంద‌ని చెప్పారు. ఆయ‌న డైరెక్ట్ చేసిన ఉప్పెనలో కృతిశెట్టి.. ఓ సినిమాతో స్టార్ హీరోయిన్ అయ్యింది. అయితే క‌మ‌ర్షియ‌ల్ మూవీ కార‌ణంగానే ఆమె స్టార్ కాలేదు. పెర్ఫామెన్స్ వ‌ల్ల అయ్యింది. అలాగ‌ని క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్స్‌గా చేయ‌డం సుల‌భ‌మ‌ని కాదు.
 
- ఇప్పుడున్న హీరోయిన్స్‌లో స‌మంతగారంటే చాలా ఇష్టం. పెర్ఫామెన్స్ అయినా, గ్లామ‌ర్ రోల్స్ అయినా ఆమె చ‌క్క‌గా చేస్తారు. అలాగే అనుష్కగారంటే ఇష్ఠం. సౌంద‌ర్య‌గారంటే ఎంతో అభిమానం. త‌ను బ్రిలియంట్ యాక్ట‌ర్‌. 
 
- తెలుగులో రిప‌బ్లిక్ సినిమా విడుద‌ల‌వుతుంది. మ‌రో తెలుగు సినిమా చేయ‌డం లేదు. క‌థ‌లు వింటున్నాను. త్వ‌ర‌లోనే కిర‌ణ్ రెడ్డిగారి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాను. త‌మిళంలో చాలా సినిమాలు చేస్తున్నాను.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు