బెంగళూరు విద్యార్థిని హత్య: మిషన్ యామిని ప్రియ వాట్సప్ గ్రూపుతో నిత్యం వేధిస్తూ వెంటాడి హత్య

ఐవీఆర్

శనివారం, 18 అక్టోబరు 2025 (13:33 IST)
కర్టెసి-ట్విట్టర్
బెంగళూరులో బీఫార్మసి విద్యార్థిని యామిని ప్రియ దారుణ హత్యకు సంబంధించి భయంకరమైన వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ప్రేమోన్మాది, నిందితుడు అయిన విఘ్నేష్ తన వాట్సాప్ పేజీలో మిషన్ యామిని ప్రియ అంటూ ఓ గ్రూపును క్రియేట్ చేసాడు. దాని ద్వారా ఆమె కదలికలను తెలుసుకుంటూ నిత్యం ఆమెను వేధిస్తూ వెంటాడుతూ వున్నాడు. అలా తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్న 20 ఏళ్ల యామిని ప్రియను గురువారం నాడు స్క్వేర్ మాల్ వెనుక రైల్వే పట్టాల దగ్గర ఆమెను హత్య చేశాడు. పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా నెలల తరబడి ఆమెను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విఘ్నేష్ ఆమెను హత్య చేశాడు.
 
కత్తితో తీవ్రంగా పొడవడంతో ఆమె చేసిన ఆర్తనాదాలు విన్న తర్వాత స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు, కానీ యామిని అప్పటికే ప్రాణాలు విడిచింది. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం, విఘ్నేష్ మిషన్ యామిని ప్రియ అనే వాట్సాప్ గ్రూప్‌ను సృష్టించాడు. దాని ద్వారా అతడు తన స్నేహితులు ద్వారా ఆమె కదలికలను ట్రాక్ చేశారు. అతను ఆమెను నిరంతరం వేధించాడని, తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడని, అతని కుటుంబం కూడా యామిని తల్లిదండ్రులను వివాహ ప్రతిపాదనతో సంప్రదించిందని, దానిని ఆమె తిరస్కరించిందని ఆమె కుటుంబం తెలిపింది.
 
యామిని ఎంతో మృదుస్వభావి అనీ, ఆమె చదువుపై శ్రద్ధ పెట్టేదని ఆమె స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారు. యామిని డాక్టర్ కావాలని ఆకాంక్షించిందని, వైద్య కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష అయిన నీట్‌కు సిద్ధం కావడానికి రెండేళ్ల విరామం తీసుకుందని ఆమె తండ్రి చెప్పారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో, బి.ఫార్మ్ చేయాలని నిర్ణయించుకుంది.
 
ఆరు నెలల క్రితం, నిందితుడు ఇక్కడ సమస్యలు సృష్టించాడు. మేము శ్రీరాంపుర పోలీసులకు ఫిర్యాదు చేసాము. ఆమెను మళ్ళీ ఇబ్బంది పెట్టనని ఒక ఒప్పందంపై సంతకం చేయించారు అని యామిని బంధువు చెప్పారు. పోలీసుల ఎదుట సంతం చేయడంతో ఇక అతడు మా అమ్మాయి జోలికి రాడని మేము నమ్మాము. మేము ఆమెను కాలేజీ నుండి దింపి తీసుకురావడం కొనసాగించాము. కానీ అతను నిన్న ఆమెను వెంబడించాడని మాకు తెలియదు. హత్య చేసింది మా అమ్మాయినే అని ఎవరూ మాకు చెప్పలేదు. పోలీసులు ఫోన్ చేసినప్పుడు మాత్రమే మాకు తెలిసింది అని చెప్పారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు