సినీతారలు, సెలెబ్రిటీలు కనిపిస్తే చాలు సెల్ఫీలు తీసుకోవాలనే కుతూహలం ఇటీవల కాలంలో పెరిగిపోతోంది. బాలివుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ సైతం ఈ సెల్పీ పిచ్చి బాధితురాలిగా మారింది. ఏప్రిల్‌లో విద్య ‘బేగమ్ జాన్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఆ సినిమా నిర్మాత మహేశ్‌భట్, దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీతో కలిసి కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో నడుచుకుంటూ వెళ్తోంది విద్య. ఆమెను చూసి ఓ వ్యక్తి పరుగున వచ్చి సెల్ఫీ తీసుకుంటానని అడిగాడు.
విద్య సరేననడంతో అతను చొరవగా ఆమె భుజంపై చేయివేసి సెల్ఫీ తీసుకోబోయాడు. షాక్‌తిన్న విద్య వెంటనే చేయి తీయమని అతడికి చెప్పింది. కానీ అతను విననట్లే చేయిని అలాగే ఉంచాడు. విద్య మేనేజర్ వచ్చి హెచ్చరించాక.. అప్పుడు చేయి తీశాడు. దాంతో సెల్ఫీ దిగడానికి తగ్గట్లు కెమెరా వంక తలతిప్పిన విద్య, అతడి చేయి ఈ సారి తన వీపుపై కదులుతున్నట్లు గ్రహించింది. సాధారణంగా సౌమ్యంగా వ్యవహరించే ఆమె సహనం కోల్పోయింది.
‘‘ఏమనుకుంటున్నావ్ నువ్వేం చేస్తున్నావో తెలుస్తోందా ఇది తప్పు’’ అని అరిచేసింది. ఆ తర్వాత కూడా అతను సెల్ఫీ తీసుకోడానికి యత్నిస్తుంటే ‘‘వద్దు. బిహేవ్ యువర్‌సెల్ఫ్’’ అని అక్కడ్నించి కదిలింది. తర్వాత ఆ ఘటన గురించి మాట్లాడుతూ ‘‘ఒక అపరిచితుడు ఎవరైనా చొరవగా మన మీద చేయివేస్తే ఎంత అసౌకర్యంగా ఉంటుంది! అతను హద్దుమీరుతున్నట్లు ఫీలవుతాం. అతనలాగే హద్దు మీరాడు. మేం పబ్లిక్ ఫిగర్స్‌మే కానీ, పబ్లిక్ ప్రాపర్టీ కాదు’’ అని చెప్పింది విద్య.
ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా సెల్ఫీల గోలే. ఎవరైనా సెలబ్రిటీ కనిపించడం ఆలస్యం.. వారితో సెల్ఫీ తీసుకోవాలని ప్రతివారూ ప్రయత్నిస్తుంటారు, పోటీపడుతుంటారు. ఆ సెల్ఫీ పిచ్చికి బాధితురాలిగా మారింది విద్యా బాలన్ కాగా, దీనికి వేదికగా నిలిచింది కోల్‌కతా ఎయిర్‌పోర్ట్.