తమిళ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ తనకు ఏ కూర అంటే ఇష్టమో వెల్లడించారు. తాను నటించిన 'ఇంకొక్కడు' చిత్రం ఇటీవల విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న విషయంతెల్సిందే. ఈ సందర్భంగా విశాఖలో అతడు ఆదివారం సందడి చేశారు. నగరంలోని విమాక్స్ థియేటర్కు వచ్చిన విక్రమ్ అభిమానులతో ముచ్చటించాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన 'ఇంకొక్కడు' సినిమా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుందన్నాడు.
దర్శకుడు ఆనంద్ శంకర్ కథ చెప్పగానే విలన్ ఎవరైతే బాగుంటుందని చాలా చర్చలు జరిగాయని, చివరకు హీరో, విలన్గా తానే చేస్తానని చెప్పడంతో దర్శకుడు సరే అన్నారని, ఎప్పటి నుంచో ద్విపాత్రాభినయం చేయాలన్న కల ఈ చిత్రంతో తీరిందన్నాడు. లవ్ (విలన్), అఖిల్ (హీరో) పాత్రలకు మంచి గుర్తింపు వచ్చిందన్నాడు. సినిమా విజయవంతం చేసిన ప్రేక్షకులకు విక్రమ్ ధన్యవాదాలు తెలిపాడు. ఇక విశాఖ వస్తే చేపల తలకాయ కూర ఇష్టంగా తింటానని తెలిపాడు.