గత కొన్నేళ్ళుగా ఎగ్జిబిటర్ల దగ్గర థియేటర్లను లీజుకు తీసుకుని వాటిని టెక్నాలజీకి అనుగుణంగా ఆ నలుగురు అగ్ర నిర్మాతలు తీర్చిదిద్దారు. అందుకు థియేటర్ అసలు ఓనర్‌కు ఎటువంటి సంబంధం వుండదు. ఉత్పత్తిదారుడి దగ్గర ఓ రేటుకు కొని దాన్ని మార్కెట్‌లో ఎక్కువకు అమ్ముకునే దళారీలుగా మారి పోయారు ఆ నిర్మాతలు. అగ్ర హీరోల సినిమాల సమయంలో థియేటర్లను బ్లాక్ చేయడం, ఇష్టానుసారంగా టిక్కెట్ రేట్లు పెంచడం, చిన్న సినిమాలు ఏదైనా బాగా ఆడినా సరైన కమిషన్ రాకపోతే వెంటనే థియేటర్ నుంచి ఆ సినిమా లేపేయడం వంటి సంఘటనలు చాలానే జరిగాయి. కరోనా మొదటి వేవ్ సమయంలో రవితేజ క్రాక్ విడుదల విషయంలో పంపిణీదారుడు వరంగల్ శ్రీనుకు ఎదురయి అనుభవం తెలిసిందే. ఇలా చెప్పకుపోతే చాలానే వున్నాయి.
అసలు విషయం ఏమంటే, ఇప్పుడు థియేటర్లు ఎక్కువ శాతం ఆ నలుగురు నిర్మాతల లీజుకింద వుండడంతో ప్రస్తుతం సినిమాలు ఆడించలేక రాబడి లేక సతమతమవుతున్నారు. థియేటర్లలో సిబ్బందికి జీతాలు ఇవ్వాలి, కరెంట్ బిల్లలు, ఇతర ప్రభుత్వం పన్నులు కట్టాలి. కరోనా మొదటి వేవ్‌లో దీనిపై కొద్దిపాటి చర్చ జరిగినా కోవిడ్ నుంచి బయటపడతామని ధీమాతో వుండేవారు.
ఇందుకు సంబంధించి థియేటర్ అసలు యాజమాన్యంతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయాలని కూడా ఆ నలుగురు నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు ఫిలింనగర్ కథనాలు చెబుతున్నాయి. త్వరలోనే థియేటర్లను అసలు యజమానులకు ఇచ్చేయాలని వారు ఆలోచిస్తున్నట్లు సమాచారం. భవిష్యత్‌లో ఆ నలుగురు నిర్మాతల దోపిడీని ఆ దేవుడే అరికట్టాలని ఓ సందర్భంలోఆవేశంగా అన్న చిన్న నిర్మాతల సంఘం అధ్యక్షుడు నట్టికుమార్ మాటలు నిజమయ్యేట్లు వున్నాయి. అదే నిజమైతే చిన్న, మధ్య తరహా నిర్మాతలకు మంచి రోజులు రాబోతున్నాయి.