మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బాహుబలి నిర్మాతలు బాహుహలి 2 కొత్త పోస్టర్‌ని విడుదల చేసారు. పోస్టర్ చూస్తుంటనే గగుర్పాటు కలిగిస్తోంది, మహాబలుడు ప్రభాస్ ఒక పాదాన్ని ఏనుగు తొండం మీద ఉంచి, మరొక పాదాన్ని దాని తలమీద ఉంచినట్లున్న దృశ్యం ఒక మహాశక్తిమంతుడి శౌర్యసాహసాలను కళ్లముందు నిలువెత్తు చిత్రంగా చూపిస్తోందీ పోస్టర్. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ మహాశివరాత్రి నాడే బాహుబలి కొత్త పోస్టర్ ఎందుకు విడుదల చేసినట్లు..
బాహుబలి సినిమా తొలి భాగంలో ప్రభాస్‌ని శివ భక్తుడిలాగా చూపించారు. తొలి భాగంలో శివలింగాన్ని భుజానికెత్తుకుని ప్రభాస్ మోస్తున్నట్లు చూపిన దృశ్యాలు సినిమా మొత్తానికే హైలైట్ అనేవిధంగా ప్రేక్షకులందరిలో ఉద్వేగాన్ని కలిగించాయి. దేశ విదేశాల్లో ఆ దృశ్యాన్ని తెరపై చూస్తున్న ప్రేక్షకులు మాన్ప్రడి పోయారంటే ఆతిశయోక్తి కాదు. బాహుబలి సినిమా భారీతనాన్ని ఆ ఒక్క దృశ్యమే ప్రారంభంలో చూపించేసింది. ఈరోజుకీ ఆ దృశ్యం ప్రేక్షకులను, అభిమానులను గిలిగింతలు పెడుతూనే ఉంది. కాబట్టి లింగాన్ని మోసిన బాహుబలి ఇప్పుడు ఏనుగు తలపై కాళ్లు మోపిన దృశ్యాన్ని శివరాత్రి నాడు విడుదల చేయడం కంటే మంచి సందర్భం ఉంటుందా?
బాహుబలి రెండో బాగం 2017లో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా మారింది. తొలిభాగం తన చారిత్రాత్మక నాటకీయ దృశ్యాలతో విజువల్ ఎఫెక్టులతో బాక్సాఫీసు రికార్డును తిరగరాసింది. ప్రభాస్ తొలిభాగంలో చేసిన సాహస కృత్యాలు సినీ ప్రేక్షకులను కొత్త లోకాలకు తీసకుపోయాయి. అత్యంత కఠినంగా సాగిన స్టంట్ల కోసం ప్రభాస తన శక్తియుక్తులన్నింటినీ ధారపోశాడు.
ఇప్పుడీ పోస్టర్ చూస్తుంటే దర్శకుడు రాజమౌళి, ప్రభాస్ ఇద్దరూ తొలి భాగాన్ని మించిన భారీతనాన్ని రెండోభాగంలో చూపించనున్నట్లు ఖాయంగానే తెలుస్తోంది. కొత్తపోస్టర్ ప్రేక్షుకులను సీట్లకు అతుక్కుపోయి చూసేలా సమ్మోహితులను చేస్తోంది. తొలిబాగంలో శివలింగాన్ని ఎత్తిన ప్రభాస్ ప్రేక్షకులను మూగపోయేలా చేశాడు. ఇప్పుడీ పోస్టర్ ద్వారా రెండోభాగంలో కూడా మరింతగా ప్రేక్షకులకు షాక్ తెప్పించడం ఖాయమనిపిస్తోంది.