జనం మదిని దోచిన ఆశా భోస్లే గానామృతం

బుధవారం, 8 సెప్టెంబరు 2021 (16:30 IST)
Asha Bhosle
సెప్టెంబర్ 8న ఆశా భోస్లే పుట్టినరోజు శుభాకాంక్షలు
ఒక కొమ్మకు పూచిన పూలన్నీ పూజకు పనికిరావు అనే సామెత ఉంది. పుణ్యం చేసుకున్న పూలే పూజలో చోటు సంపాదిస్తాయి అంటారు.
 
- ఒకే తల్లి పిల్లల్లో అందరూ ఒకేలా ఉండక పోవచ్చు, కానీ కొందరు తమ కళలకు సానపట్టుకొని వెలుగులు విరజిమ్ముతూ ఉంటారు. అలాంటి వారిలో ప్రఖ్యాత గాయనీమణులు లతా మంగేష్కర్, ఆమె చెల్లెలు ఆశా భోస్లే ఉన్నారని చెప్పవచ్చు. ఇద్దరూ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ చూపిన బాటలో సంగీతసాధనతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించడం విశేషం. కుటుంబ పరిస్థితుల కారణంగా అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ పిన్నవయసులోనే సినిమా రంగంలో అడుగు పెట్టారు. కొన్ని చిత్రాల్లో బాలల పాత్రలు పోషించారు. తరువాత గానంతో అలరించడం ఆరంభించారు. లతకు మంచి పేరు వస్తున్న సమయంలోనే ఆశా కూడా చిత్రసీమలో గాయనిగా తనదైన బాణీ పలికించడం మొదలు పెట్టారు. దాదాపు వెయ్యి హిందీ చిత్రాలలో ఆశా భోస్లే పాటలతో పరవశింప చేశారు. తెలుగులో దాసరి నారాయణ రావు తెరకెక్కించిన ‘పాలు-నీళ్లు’ చిత్రంలో తొలిసారి పాడారు ఆశా భోస్లే. తరువాత “చిన్నికృష్ణుడు, పవిత్రబంధం, చందమామ” చిత్రాల్లోనూ ఆశా భోస్లే నోట తెలుగు పాటలు పలికాయి.
 
ఆశా భోస్లే పాటల్లో అదో మత్తు ఉంటుంది. అదే గమ్మత్తుగా మనలను సేద తీరుస్తుంది. సంగీత పరిభాషలో చెప్పుకొనే తారస్థాయిలో గాయనీమణులు ఆలపించే అంశాన్ని ‘సొప్రానో’ అంటారు. దీనిని ఆలపించడంలో ఆశా భోస్లే గాత్రం సుప్రసిద్దమయింది. ఈ విషయంలో అక్క లత కంటే మిన్నగా పేరు సంపాదించారు ఆశ. ప్రముఖ హిందీ సంగీత దర్శకులు ఓ.పి.నయ్యర్, ఖయ్యామ్, రవి, ఎస్.డి.బర్మన్, ఆర్డీ బర్మన్, శంకర్ జైకిషన్, ఇళయరాజా, ఎ.ఆర్.రహమాన్, జయదేవ్, అనూ మాలిక్ వంటివారు ఆశా భోస్లే గళంలో పలు స్వరవిన్యాసాలు చేయించి సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నారు. గాయనీగానే కాకుండా కొన్ని యాడ్స్ లోనూ ఆమె నటించారు. 2013లో ‘మాయి’ అనే చిత్రంలో తొలిసారి బిగ్ స్క్రీన్ పై నటించి ఆకట్టుకున్నారు.
 
తొలి తెలుగు పాట‌
ఉత్తరాది వారినే కాదు, దక్షిణాది భాషల్లోనూ ఆశా భోస్లే గానం పరవశింప చేసింది. తెలుగులో కొన్ని చిత్రాల్లో పాడినా, వాటి ద్వారానే మన జనం మదిని దోచేశారు ఆశా భోస్లే. ‘పాలు-నీళ్ళు’లో ఆశా భోస్లే పాడిన తొలి తెలుగు పాట, “ఇది మౌనగీతం.ఒక మూగరాగం.” అంటూ సాగుతుంది. సత్యం స్వరకల్పనలో రూపొందిన ఈ గీతం అప్పట్లో జనాన్ని భలేగా ఆకట్టుకుంది. తరువాత జంధ్యాల దర్శకత్వంలో కృష్ణ కొడుకు రమేశ్ హీరోగా రూపొందిన ‘చిన్నికృష్ణుడు’లో “జీవితం సప్తసాగర గీతం.” పాటతో మరింతగా ఆకట్టుకున్నారు ఆశా. ‘చిన్నికృష్ణుడు’కు ఆశ భర్త ఆర్.డి.బర్మన్ స్వరకల్పన చేయడం విశేషం. కీరవాణి సంగీతం సమకూర్చిన ‘పవిత్రబంధం’లో ఆశా భోస్లే తెరపై కూడా కనిపించారు. అందులో “ఐసలకిడి.అమ్మమ్మో ఏం వేడి.” అనే పాటను పాడారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చందమామ’లో కె.ఎమ్.రాధాకృష్ణన్ స్వరకల్పనలో “నాలో ఊహలకు. నాలో ఊసులకు.” పాట పాడి ఆశ మురిపించారు.
 
ఫాల్కే అవార్డు
ఆశా భోస్లే ప్రతిభకు అనేక అవార్డులూ, రివార్డులూ లభించాయి. 2000లో ఆశా భోస్లేకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. 2008లో పద్మవిభూషణ్ అందుకున్నారామె. ఒకే తల్లి పిల్లలయిన బి.ఎన్.రెడ్డి – బి.నాగిరెడ్డి, బి.ఆర్.చోప్రా – యశ్ చోప్రా, రాజ్ కపూర్ – శశికపూర్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకున్న అన్నదమ్ముల జాబితాలో ఉన్నారు. ఇక అక్కాచెల్లెళ్ళు ఫాల్కే అవార్డును అందుకోవడం లత, ఆశ విషయంలోనే జరిగింది. అలా అక్కకు తగ్గ చెల్లెలిగానూ ఆశా భోస్లే నిలిచారు. సెప్టెంబర్ 8తో 88 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న ఆశా భోస్లే మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు