ప్రఖ్యాత కర్ణాటక సంగీత విధ్వాంసులు "పద్మ విభూషణ్" డా. మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారిని పౌర సన్మానం మరియు స్వర్ణ కంకణంతో సత్కరించనున్నట్లు నాట్స్ అధ్యక్షులు శ్రీ రవి ఆచంట మరియు గజల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు. పాలకొల్లులోని శ్రీ బొండాడ వెంకటరాజు గుప్తా మునిసిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో 2015 మార్చి 7,8,9 తేదీలలో నిర్వహించే 8వ జాతీయ స్థాయి నాటకోత్సవాలలో ప్రారంభ సభలో 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి డా. కోడెల శివప్రసాద్‌గారు డా. మంగళంపల్లి బాలమురళి కృష్ణగారిని స్వర్ణ కంకణంతో సత్కరిస్తారని, ఈ కార్యక్రమానికి మునుపు సంగీతరథంపై డా. మంగళంపల్లి బాలమురళికృష్ణగారిని పాలకొల్లు పురవీధులలో గౌరవంగా ఊరేగించి పౌర సన్మానానికి తోడ్కొని వెళతారని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుండి ఎంతోమంది కళాకారులు, రాజకీయవేత్తలు, ప్రముఖులు విశేషంగా పాల్గొంటునట్లు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నాటకోత్సవాలలో 8 నాటికలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రతి నాటికకు పది వేల రూపాయలు నగదు బహుమానం, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదేరోజు డా. మంగళంపల్లి బాలమురళికృష్ణగారు తూర్పు గోదావరి జిల్లా శoకరగుప్తంలో ఉన్న తన స్వస్థలానికి కూడా వెళతారని నిర్వాహకులు తెలిపారు