ఫిబ్రవరి 22న యూత్ స్టార్ సిద్ధార్థ, సమంత జంటగా నటించిన 'జబర్‌దస్త్' విడుదలకు సిద్ధమయింది. మల్టీ డైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ రజత్ పార్థసారధి సమర్పణలో శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై బి.వి.నందినిరెడ్డి దర్శకత్వంలో అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మించిన ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ 'జబర్‌దస్త్'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 22న వరల్డ్‌వైడ్‌గా విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ - ''మా 'జబర్‌దస్త్' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 22న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం. థమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలై పెద్ద విజయం సాధించింది. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో వున్నాయి.
ప్రతి ఒక్కరూ ఈ చిత్రం చూసి ఎంటర్‌టైన్ అయ్యేలా నందినిరెడ్డి అద్భుతంగా రూపొందించారు. సిద్ధార్థ, సమంతల పెర్‌ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలైట్ అవుతుంది. మా బేనర్‌లో వచ్చిన 'కందిరీగ', 'కాంచన', 'బాడీగార్డ్', 'బస్‌స్టాప్' వంటి సూపర్‌హిట్స్ తర్వాత వస్తోన్న 'జబర్‌దస్త్' డెఫినెట్‌గా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం నాకు వుంది'' అన్నారు.
హీరో సిద్దార్ధ మాట్లాడుతూ - ''జబర్‌దస్త్'తో నా కెరీర్ మారిపోతుంది. ఒక సూపర్‌హిట్ అయ్యే ఫిలిమ్‌ను నాతో తీసిన నందినిరెడ్డికి నా థాంక్స్. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిలిమ్‌ను మాస్ టచ్‌తో తీసింది. ఈ చిత్రంలో నేను చేసిన బైర్రాజు క్యారెక్టర్ ఫుల్‌లెంగ్త్ కామెడీగా ఉంటుంది. తప్పకుండా ఈ సినిమా సూపర్‌హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ నాకు వుంది'' అన్నారు.
హీరోయిన్ సమంత మాట్లాడుతూ - ''అలా మొదలైంది లాంటి మంచి చిత్రాన్ని డైరెక్ట్ చేసిన నందినిరెడ్డిగారి డైరెక్షన్‌లో సినిమా చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. నా కెరీర్‌లోనే ఫస్ట్‌టైమ్ ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. అది తప్పకుండా అందరికీ నచ్చుతుంది'' అన్నారు.