31న 'ఎవడు' వస్తున్నాడు... 'అత్తారింటికి దారేది' దానిదారి అదే
సోమవారం, 22 జులై 2013 (18:31 IST)
WD
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, శృతి హాసన్, ఎమీ జాక్సన్ నటీనటులుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన చిత్రం 'ఎవడు'. వంశీ పైడిపల్లి దర్శకుడు. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ముఖ్యపాత్రలు పోషించారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 31న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...నేటితో ఎవడు సినిమా ప్యాచ్వర్క్లన్నీ పూర్తయ్యాయి. త్వరలో సెన్సార్‌కి వెళ్ళబోతుంది. చరణ్ చేసింది 5 సినిమాలే అయినా అందులో మూడు సినిమాలు కమర్షియల్‌గా పెద్ద హిట్టయ్యాయి. మా సంస్థలో వస్తున్న ఈ చిత్రం కూడా కమర్షియల్‌గా ఘన విజయం సాధించే అవకాశం ఉంది.
మాతో కంటిన్యూగా మూడు సినిమాలు చేసిన వంశీని మరో లెవల్‌కి ఈ సినిమా తీసుకెళుతుంది. సినిమా ప్రారంభమైన రోజు నుంచి ఈ రోజు వరకు అతను పడిన కష్టం మాటల్లో చెప్పలేను. విజువల్ ఫీస్ట్‌గా ఈ చిత్రముంటుంది. డిఎస్పి ఇచ్చిన సంగీతం పెద్ద హిట్టయింది. అల్లు అర్జున్ యాక్ట్ చేసింది 10 నిమిషాలే అయినా ఆయన క్యారెక్టర్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. జూలై 31న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన మగధీర విడుదలైన రోజే ఎవడు చిత్రాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం అని తెలిపారు.
'ఎవడు' రిలీజ్‌కి 'అత్తారింటికి దారేది' రిలీజ్‌కి మధ్య పెద్ద గ్యాప్ లేకపోవడం పట్ల మీ అభిప్రాయం?అని అడిగితే దిల్ రాజు ఇలా చెప్పారు. అత్తారింటికి దారేది సినిమా విడుదల తేదిని ముందే ప్రకటించారు. మేం కొంచెం వెనక్కి వెళదామంటే జంజీర్ కూడా డేట్ ఫిక్స్ అయింది.
మాకు టెక్నికల్‌గా లేట్ కావడం వల్ల 31న విడుదల చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు గదర్, లగాన్ సినిమాలు తక్కువ రోజుల తేడాతో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయి. అలాగే 'ఎవడు', 'అత్తారింటికి దారేది' చిత్రాలు కూడా ఘన విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నాను అని అన్నారు.
దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ... కథ చెప్పగానే నచ్చి నన్ను ప్రోత్సహించిన చిరంజీవి గారికి, చరణ్‌కి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సినిమాకి కష్టపడిన మాట ప్రక్కన పెడితే సినిమా రిలీజ్ అయ్యాక నా కెరియర్‌కి మంచి మెమొరీగా ఈ చిత్రం నిలుస్తుంది. బన్ని ఒప్పుకోకపోతే ఈ సినిమానే లేదు. మా హీరో, నిర్మాత అవుట్‌పుట్ పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సినిమా బాగా రావడానికి నేనొక్కడినే కారణం కాదు. నా టీమంతా సహకరించబట్టే ముందుకెళ్ళగలిగాను. ఫిలిం లవర్ ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుంది అని అన్నారు.