ఓ సామాన్య మానవుడికి ఐఫోన్ కొనుక్కోవాలనే ఆశ. దాన్ని కొనుక్కునే ప్రయత్నంలో ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అసలు అతని ఆశ నెరవేరిందా ? లేదా? అనేది తెరపైనే చూడాలంటున్నారు దర్శకుడు శరవణ రాజన్. జై, స్వాతి, నటీనటులుగా శరవణ రాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం 'వడకర్రి'. ఎస్.ఎన్.ఆర్ సినిమాస్ పతాకంపై నరసింహరెడ్డి సామల 'కుల్ఫీ' టైటిల్‌తో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సన్నిలియోన్ ఓ ఐటమ్ సాంగ్‌లో నటించింది. తమిళ దర్శకుడు వెంకట ప్రభు, కస్తూరి కీలక పాత్రల్లో కనిపిస్తారు. యువన్ శంకర్‌రాజా-మర్విన్ సాల్మన్-వివేక్ సంగీత దర్శకులు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ సోమవారం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగింది,
వి.సాగర్, చదలవాడ శ్రీనివాసరావు, వి.సముద్ర, సురేష్ కొండేటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వి.సాగర్ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. దర్శకుడు శరవణరాజన్ మాట్లాడుతూ... అందరూ చెప్పినట్లుగా మేమీ సినిమాకి కష్టపడి పనిచేయలేదు. చాలా సరదాగా షూటింగ్ చేశాం. సినిమా చాలా ఫన్నీగా ఉంటుంది. తమిళంలో పాటలు హిట్టైయ్యాయి. తెలుగులో కూడా పాటలు, సినిమా హిట్ కావాలని ఆశిస్తున్నాను అన్నారు. సినిమా రెండు భాషల్లోనూ హిట్ కావాలని కథానాయిక స్వాతి అభిలాషించారు.
వి.సాగర్ మాట్లాడుతూ... తెలుగు, తమిళ భాషల్లో కూడా చక్కని టైటిళ్ళు పెట్టారు. ఇటీవల వస్తున్న దర్శకులు చక్కని సినిమాలు తీస్తున్నారు. ఈ సినిమా కూడా బాగా వచ్చిందనుకుంటున్నాను. వృత్తి రీత్యా లాయర్ అయిన నరసింహరెడ్డి నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నం సక్సెస్ అయ్యి మంచి లాభాలు రావాలి అని అన్నారు.
సంగీత దర్శకులు వివేక్ - మర్విన్ సాల్మన్ మాట్లాడుతూ... యువన్‌శంకర్‌రాజా ఓ పాటకు సంగీతం అందించారు. మేమిద్దరం నాలుగు పాటలు చేశాం. ఆర్.ఆర్ కూడా బాగా వచ్చింది అని తెలిపారు. చిత్ర నిర్మాత నరసింహరెడ్డి సామల మాట్లాడుతూ... తమిళంలో రూపొందిన వడకర్రి సినిమాని తెలుగులో కుల్ఫీగా అనువదిస్తున్నాం. ఫోన్ చుట్టూ తిరిగే కథ ఇది. ప్రస్తుతం డబ్బింగ్ తదితర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
పోర్న్‌స్టార్ సన్నిలియోన్ తొలిసారి దక్షిణాది చిత్రంలో నటించిన చిత్రమిది. ఈ చిత్రం ద్వారా ఆమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడం ఆనందంగా ఉంది. ఓ ప్రత్యేక పాటలో ఆమె నటించింది. రొమాంటిక్ థ్రిల్లరిది. చక్కని పాటలు కుదిరాయి. యువతకు కావలిసిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. జూన్ మూడవ వారంలో సినిమాను విడుదల చేస్తాం అని అన్నారు.
మాటల రచయిత కృష్ణతేజ మాట్లాడుతూ... చక్కని కథ, వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా తెరకెక్కింది. చక్కని సంగీత, సాహిత్యాలు కుదిరాయని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
సాంకేతిక నిపుణులు : ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, మాటలు: కృష్ణతేజ, పాటలు: భువనచంద్ర, కందికొండ, శ్రీమణి, వనమాలి పవన్, కెమెరా: ఎస్.వెంకటేష్, నిర్మాణ నిర్వాహణ:ఎ.ఎన్ బాలాజీ, సమర్పణ: శ్రీనివాసరెడ్డి సామల, నిర్మాత:నరసింహరెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శరవణరాజన్.