చెడిపోయిన యువతకు ఇచ్చిన తీర్పే "నాపేరు శివ"

శనివారం, 6 ఆగస్టు 2011 (12:25 IST)
WD

పాయింట్‌: నలుగురు యువకులు చేసిన అరాచకాలకు శివ ఇచ్చిన తీర్పు.

యుగానికి ఒక్కడు, ఆవారా చిత్రాలతో తెలుగులో కూడా పరిచయమైన నటుడు కార్తీ. సూర్య సోదరుడిగా కొత్త కాన్సెప్ట్‌లతో ఆకట్టుకున్నాడు. అటువంటి ప్రయోగమే "నాపేరు శివ". భారతంలో తన అహంకారంతో ద్రౌపదిని పీడించిన కీచకుడుకి భీముడు ఇచ్చిన తీర్పు మరణశిక్ష. అది ఎంత భయంకరమైనదంటే... చేతులు, కాళ్ళు, తల, మొండెం వేరు చేసి విరిగిని చేతుల్ని కడుపులో గుచ్చితో వెనుకభాగం వైపుకు వస్తాయి. ఇలా ప్రతి అవయవాన్ని ఛిద్రంగా చేస్తే చూడ్డానికి భయంకరంగా ఉంటుంది. గతంలో అటువంటి చావులు విన్నాం. నేడు కొన్ని వార్తాపత్రికల్లోనూ టీవీల్లోనూ చూస్తున్నాం. అటువంటి కథల్లోంచి దర్శకుడు అల్లిన కథే "నాపేరు శివ".

శివ (కార్తీ) ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవాడు. తండ్రి క్యాబ్‌ డ్రైవర్‌. చెల్లెలు, అమ్మ, సోదరుడు ఇదీ వారి కుటుంబం. స్ట్రెయిట్‌ ఫార్వెడ్‌తోపాటు జాలిగుణం ఎక్కువ. తన స్నేహితుల పెండ్లికి వెళ్ళి అక్కడ ప్రియ(కాజల్‌ అగర్వాల్‌)ను చూసి తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. తను కూడా డిటో. అయితే ఆమె తండ్రి గొప్ప లాయర్‌. అంగీకరించడు. 3 నెలలు గడువుపెట్టి మంచి ఉద్యోగం చూసుకోమంటాడు.

వెంటనే స్నేహితుని ద్వారా బ్యాంక్‌ రికవరీ ఉద్యోగిగా వెళ్ళి అక్కడ తనకున్న జాలి గుణంతో పని సరిగ్గా చేయలేక ఉద్యోగాన్ని కోల్పోతాడు. మరోవైపు కాలేజీ చదివే ఓ స్నేహితుడు ప్రేమించిన అమ్మాయిని ఒక్కటి చేయాలని తనకు తెలిసిన మరో స్నేహితుల ఇంటికి తీసుకెళతాడు. అక్కడ మాదకద్రవ్యాలకు బానిసలైన నలుగురు స్నేహితులు ఆ అమ్మాయిని అనుభవించి, ప్రియుడ్ని కూడా చంపేసి చేతులు, కాళ్ళు, తల, మొండెం వేరు చేసి సిటీలో వేరువేరుచోట్ల పారేస్తారు. అంతకుముందు చనిపోయిన ప్రేమికుల జంట శివ తండ్రి కాబ్‌లో ఎక్కుతారు. పోలీసుల పరిశోధనలో తల దొరకడంతో శివ తండ్రి దాన్ని గుర్తిస్తాడు. దాంతో ఆయనను ఆ నలుగురు కాలేజీ చదివే యువకులు చంపేస్తారు. ఆ తర్వాత శివ లోతుగా పరిశోధించి వారికి తీర్పు ఎలా ఇచ్చాడన్నది కథ.

మొదటి భాగమంతా చాలా సరదాగా, సగటు మనషి జీవితం ఇలా ఉంటుందని కళ్ళకుకట్టినట్లు దర్శకుడు చూపించాడు. పాత్రలు కూడా కరెక్ట్‌గా సూటయ్యాయి. శివ పాత్ర సగటు మానవునికి ప్రతీక. సమాజంలో జరుగుతున్నఅరాచకాలకు స్పందించే గుణం. జాలి గుణం కన్పించాయి. దీన్ని దర్శకుడు చక్కగా తీర్చిదిద్దాడు. కాజల్‌ అగర్వాల్‌ చాలా క్యూట్‌గా ఉంది. యువన్‌ శంకర్‌రాజా బాణీలు కథానుగుణంగా ఉన్నాయి.

టెక్నికల్‌గా సపోర్ట్‌ బాగుంది. స్క్రీన్‌ప్లే ఆసక్తి కలిగించింది. తర్వాత ఏం జరుగుతుందోనన్న సస్పెన్స్‌ క్రియేట్‌ చేశాడు. యువత చెడు సావాసాలవల్ల ఎంతకైనా తెగిస్తారనేది కళ్ళకు కట్టినట్లు చూపించాడు. అలాంటి యువతకు చెంపపెట్టు ఈ చిత్రం. తల్లిదండ్రులు తమ పిల్లలు కనిపెట్టకపోతే ఎలా ఉంటారో ఈ చిత్రం చెబుతుంది. హింస ఎక్కువైనా పతాక సన్నివేశంలో నలుగురు యువకుల్ని శివ చంపే విధానం ఏమాత్రం జుగుప్సగా అనిపించలేదు. దానికి కారణం కథలోని కొత్తదనం. అది చూడాలంటే సినిమాకు వెళ్ళాల్సిందే. టాలీవుడ్‌లో డబ్బింగ్‌ చిత్రాల హవా నడుస్తున్నదనడానికి ఈ చిత్రం మరో ఉదాహరణ.

వెబ్దునియా పై చదవండి