టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ - శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "అమర్ అక్బర్ ఆంటోనీ". (ట్రిబుల్ ఏ). ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్‌లు సంయుక్తంగా నిర్మించారు.
అటు హీరో రవితేజకు, ఇటు దర్శకుడు శ్రీను వైట్లకు భారీ డిజాస్టర్‌ల తర్వాత వచ్చిన చిత్రం 'ఏఏఏ'. రవితేజ ఖాతాలో 'టచ్ చేసి చూడు', 'నేల టిక్కెట్' వంటి చిత్రాలు, శ్రీనువైట్లకు 'ఆగడు', 'బ్రూస్‌లీ', 'మిస్టర్' వంటి చిత్రాలు భారీ పరాజయాల లిస్టులో ఉన్నాయి. ఇపుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'ట్రిబుల్ ఏ'.
ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దీంతో ఈ చిత్రం ప్రీమియర్ షోలు అమెరికా వ్యాప్తంగా గురువారం రాత్రి ప్రదర్శించారు. ఈ చిత్రానికి ఓ మోస్తరు టాక్ వచ్చింది. చిత్రం తొలి భాగమంతా పూర్తి హాస్యభరితంగా సాగింది. ముఖ్యంగా, తొలి అర్థభాగాన్ని శ్రీనువైట్ల తన పాత విధానంతోనే తెరకెక్కించారు.
కానీ, ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గరకొచ్చేసరికి హీరోకి సంబంధించిన మూడు పాత్రల విషయంలో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుందని చెపుబుతున్నారు. ఇక చిత్రం రెండో భాగం అంతా మంచి టెంపోతో సాగిపోవడంతో ఆడియన్స్‌ను థియేటర్ సీట్ల నుంచి కదలకుండా చేసిందట.
రవితేజ తన మార్కు హాస్యంతో కడుపుబ్బ నవ్విస్తే, మిగిలిన కమెడియన్ గ్యాంగ్ తమ పనిని చక్కగా పూర్తి చేశారు. అలాగే, ఏడేళ్ళ తర్వాత టాలీవుడ్ వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రం ఎక్కువ భాగం అమెరికాలోనే చేశారు. మొత్తానికి 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం ఫర్వాలేదనే టాక్‌ను సొంతం చేసుకుంది.