'జై సింహా' తర్వాత కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన 105వ చిత్రం 'రూలర్'. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటించారు. రైతు సమస్యలపై చిత్రం అని ముందుగానే వార్త రావడంతో ఎలా వుంటుందనే ఆసక్తిమటుకు కల్గించింది. శుక్రవారమే విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ:
అది ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా. అక్కడ దోపీడీలు, హత్యలు, అత్యాచారాలు యధేచ్చగా జరుగుతుంటాయి. దీన్ని అరికట్టేందుకు రాజకీయ, పోలీసు యంత్రాంగమంతా భేటీ అవుతారు. వ్యవసాయశాఖా మంత్రి ప్రకాష్ రాజ్.. దీనికంతటికి కారణం. ఆకలి. ఉద్యోగం లేకపోవడంగా పేర్కొని.. అందుకు వ్యవసాయాన్ని వృద్ధిచేస్తే వీటిని కంట్రోల్ చేయవచ్చని సలహా ఇస్తాడు. వెంటనే రూల్ పాస్‌చేసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం మేరకు కొన్ని బీడు భూముల్ని ఆంధ్ర ప్రాంతం నుంచి రైతుకూలీల్ని తీసుకు వచ్చి సస్యశ్యామలం అవుతుంది.
ఇంకోవైపు భర్త, పిల్లాడిని కోల్పోయిన జయసుధ (సరోజినీ ప్రసాద్) పెద్ద ఐటీ బిజినెస్ మాగ్నెట్. తను కారులో వెళుతుండగా చావుబతులమధ్య వున్న వ్యక్తి (బాలకృష్ణ)ను కాపాడుతుంది. ఆ తర్వాత అతనే తన ప్రాణాల్ని కాపాడే పరిస్థితి రావడంతో గతాన్ని కోల్పోయిన బాలకృష్ణను అర్జున్‌ప్రసాద్‌గా పేరు పెట్టి దత్తత తీసుకుంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ తన కంపెనీని నెంబర్ 1లోకి తీసుకువస్తాడు.
ఆ సమయంలో ఝాన్సీ జిల్లాలో తన తల్లి నెలకొల్పాలనుకున్న కంపెనీ గురించి తల్లికి జరిగిన అవమానాన్ని గురించి తెలుసుకుని అర్జున్ ప్రసాద్ ఏం చేశాడు? అసలు చావుబతులమధ్య వున్న బాలకృష్ణ ఎవరు? వీరిద్దరికి ఏదైనా సంబంధం వుందా? ఇంకా భూమిక పాత్ర ఏమిటి? యు.పి.లో ఆంధ్ర రైతుల్ని ఆదుకున్న దెవరు? అనేవి తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ కథంతా పరిశీలిస్తే మూడు చిత్రాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. 'ఛత్రపతి', 'కాలా', 'ఆంధ్రుడు' వంటి చిత్రాలు స్పురణకు వస్తాయి. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్‌ను డైరెక్ట్‌గా చెప్పినా ఆ తర్వాత స్క్రీన్‌ప్లేలో యాక్షన్ అంశాలతో ముంచేశాడు. హత్యలు, దోపిడీలు అనేవి కేవలం పనీపాటాలేనివాళ్ళు చేసేవన్న ఫీలింగ్ కల్గించి వ్యవసాయం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేయవచ్చనే కాన్సెప్ట్ బాగున్నా.. ఆ తర్వాత కూడా 'ఎంత వరకు దోపిడీలు, హత్యలు కంట్రోల్ అయ్యాయో తర్వాత సంగతి' అంటూ ఓ డైలాగ్ రూపంలో చెప్పి.. మిగిలన కథను నడిపించాడు.
ఇందులో ప్రధానమైన పాయింట్.. కులం, అధికార దాహం. దీని చుట్టూ బోల్డన్ని కథలు రకరకాల కోణంలో అన్ని భాషల్లోనూ వచ్చేశాయి. 'రూలర్' అనేది ఆ కోవలోనిది. అయితే యు.పి.లో ఎలాంటి పరిస్థితి వుందనేది అందరికీ తెలిసిందే. ఎక్కువగా మానభంగాలు, హత్యలు, దోపిడీలు జరుగుతూనే వుంటాయి. అలాంటివి నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఓ జమిందారీ పటేల్ కథే ఇది.
ఇందులో ప్రజలకు మంచి చేయాలనే తపన వున్న పాత్రలో జమిందారీకి చెందిన మంత్రి పాత్రను ప్రకాష్‌రాజ్ న్యాయం చేశాడు. తన కుమార్తెగా భూమిక నటించింది. కులం కానివాడిని ప్రేమించినందుకు ఆమె బాబాయ్ అతని చంపడానికి ప్రయత్నించడం, ఆస్తికోసం అన్న అయిన ప్రకాష్‌రాజ్‌ను హత్యచేయడానికి కుట్రప్రన్నడం వంటివన్నీ వర్తమాన రాజకీయాలకు అద్దంపట్టాయి.
ఇక నటీనటులపరంగా బాలకృష్ణ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. కెమెరాలో వయస్సు కన్పిస్తున్నా బాడీలో యువకుడిలా డాన్స్‌లు, ఫైట్లతో ఆకట్టుకున్నాడు. చాలా ఎనర్జిటిక్‌గా వున్నాడు. పోలీసు ఆఫీసర్ పాత్రలోనూ, ఐటీ వ్యాపారవేత్త పాత్రలోనూ సరిపోయాడు. హీరోయిన్లయిన వేదిక, సోనాల్ చౌకన్ పాత్రలు కేవలం ఆటవిడుపుగా కన్పిస్తాయి. మిగిలిన పాల్రన్నీ వారి వారి పాత్రలకు అనుగుణంగా నడిచాయి. యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో కొన్ని సన్నివేశాల్లో ఆసక్తికరంగా సాగుతుంది. అలాగే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని సీన్స్ అలరిస్తాయి.
దర్శకుడు కెఎస్. రవికుమార్ రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నప్పటికీ కథనంలో కొంత గందరగోళం కన్పిస్తుంది. మొదట్లోనే జయసుధ, బాలయ్యను కాపాడిన సన్నివేశం చూపాక వెంటనే ఆమె ఆసుపత్రిలో జాయిన్ అయిన సన్నివేశం చూపిస్తాడు. సోనాల్‌ను చూపిస్తూ పాట పాడుతున్నాడు అనుకున్న టైంలో షడెన్‌గా వేదిక తెరపై పాటతో కన్పిస్తుంది. రివర్స్ స్క్రీన్‌ప్లే తరహా ఆకట్టుకునే ప్రయత్నంలో కన్‌ఫ్యూజ్ మాత్రం స్పష్టంగా కన్పించింది.
మొదటిభాగంలో హేకర్స్‌గా వచ్చిన రఘు, ధనరాజ్, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి పాత్రలు పక్కా మాస్ కామెడీగా తీర్చిదిద్దారు. మొదటి భాగం సరదాగా సాగినా ద్వితీయార్థంలో బోల్డంత సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం చాలా వరకు లోపించింది. అలాగే చాల కీలకమైన సన్నివేశాలను కూడా దర్శకుడు చాలా సినిమాటిక్‌గా చూపించాడు.
టెక్నికల్‌గా చూస్తే కెమెరామెన్ రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్‌గా నిలుస్తోంది. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. సంగీత దర్శకుడు చిరంతన్ భట్ అందించిన నేపథ్య సంగీతం జస్ట్ ఓకే అనిపిస్తుంది. సాంగ్స్ కూడా పూర్తిగా ఆకట్టుకునే విధంగా లేవు. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. నిర్మాత సికళ్యాణ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు మంచి కథాంశం తీసుకున్నా.. ఆ కథాంశానికి తగ్గట్లు ఉత్కంఠభరితమైన కథాకథనాలను మాత్రం రాసుకోలేకపోయాడు. జస్డ్ ఏవరేజ్‌గా చిత్రం నిలుస్తుంది. మాస్ ప్రేక్షకులకు ఎక్కితే చిత్రం మరోలా వుంటుంది.