సాయితేజ్ 'చిత్రలహరి' అలా వాయించేశాడు... రివ్యూ రిపోర్ట్

శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (14:42 IST)
చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన సాయి ధరమ్‌ తేజ్‌ వరుసగా ఆరు ఫ్లాపులు రుచి చూశాడు. పేరు సెంటిమెంట్‌ అనుకున్నాడేమో 'సాయి తేజ్‌'గా పేరు మార్చేసుకున్నాడు. ఏడో చిత్రంగా 'చిత్రలహరి' చేసి ఈసారైనా హిట్‌ కొట్టాలని తపన పడ్డాడు. అందుకు తన కెరీర్‌కు తగినట్లే ఓ కథను చూసుకున్నాడు. 'నేను శైలజ' చేసిన కిషోర్‌ తిరుమలను దర్శకుడిగా ఎంచుకున్నాడు.

ట్రైలర్‌లోనే హీరో దురదృష్టవంతుడు ఏది చేసినా బెడిసికొడుతుందనేది చెప్పేశాడు. అలాంటి వ్యక్తి సక్సెస్‌వైపు ఎలా వెళ్ళాడనేది సినిమా అని ముందే తేటతెల్లం చేసేశాడు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. కళ్యాణి ప్రియదర్శిని, నివేదా పెతురాజ్ హీరోయిన్స్‌గా నటించారు. మరి ఈ సినిమాతో సాయి విజయం అందుకున్నాడా లేదా అన్నది చూద్దాం.
 
కథ:
విజయ్‌ కష్ణ (సాయి తేజ్‌) సాఫ్ట్‌వేర్‌లో ఎలక్ట్రానిక్‌ కోర్సు చేశాడు. తగిన ఉద్యోగం కోసం వెతకడం.. బెడిసి కొట్టం మామూలే. ప్రమాదాల్ని అరికట్టే కొత్త సాఫ్ట్‌వేర్‌ కనిపెట్టి దానికి స్పాన్సెర్ల కోసం తిరుగుతుంటాడు. ఏదీ సెట్‌కాదు. అలాంటి టైంలోనే లహరిని (కళ్యాణి ప్రియదర్శిని) చూసి ఇష్టపడతాడు. ఇంప్రెస్‌ చేసి ప్రేమను సంపాదిస్తాడు. రూమ్‌మేట్‌ స్వేచ్ఛ (నివేద పెతురాజ్) మాటలు నమ్మి సాయితేజ్‌ను వదులుకుంటుంది లహరి. 
 
సరిగ్గా ఆ టైంలోనే స్వేచ్ఛకు విజయ్‌ సాఫ్ట్‌వేర్‌ నచ్చి ముంబై హెడ్‌ ఆఫీసుకు తీసుకువెళుతుంది. అక్కడిచ్చిన డెమోలో విమర్శించిన ఓ వ్యక్తిపై సాయి చేయి చేసుకుంటాడు. ఆ తర్వాత జీవితంపై విరక్తి చెంది తిరిగిన వచ్చిన సాయితో ఆయన తండ్రి పోసాని స్పూర్తి రగిలిస్తాడు. ఆ తర్వాత సాయి ఏం చేశాడు? కథ ఎటువైపు మళ్ళింది? అన్నది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ఒక మనిషి ఎందుకూ పనికిరాడని చుట్టుపక్కల వారంటుంటే చివరికి అతనే సమాజానికి కావాల్సినవాడుగా ఎదగడం అనేది చాలా చిత్రాల్లో వచ్చేసిందే. కథలో కొత్తదనం లేకపోయినా పాత్రపరంగా సాయితేజ్‌ కన్పిస్తాడు. ఫుల్‌ గెడ్డంతో పోరాట యోధుని గెటప్‌లో కన్పిస్తాడు. బహుశా తను చేయబోయే తర్వాత చిత్రానికి పెంచినట్లుగా వుంది మినహా ఈ కథకు ఏమాత్రం అవసరంలేని గెటప్‌ అది. జీవితంలో అనుకున్నది సాధించలేకపోయి ఉన్నదాంట్లో ఎడ్జెస్ట్‌మెంట్‌ అవుతూ.. ప్రెస్టేషన్‌తో మందుకొట్టే పాత్రలో సునీల్‌ కన్పిస్తాడు. ఇద్దరూ గ్లాస్‌మేట్స్‌గా బార్‌లో ఏర్పడిన పరిచయం చివరివరకు సాగుతుంది. కథలో కొత్తదనం పెద్దగా లేకపోయినా కలలు కనేవాడు కలాం లాంటివాడవుతాడు. అందుకు ఓపిక, సహనం చాలా అవసరం అనే సందేశాన్ని ఇచ్చాడు దర్శకుడు. 
 
రొటీన్‌ చిత్రాల మాదిరిగా లవ్‌ట్రాక్‌, యాక్షన్‌ సీన్లు లేని  ఈకథ సాయితేజ్‌కు సక్సెస్‌ దోబూచులాడుతుంది. అనే ఫీల్‌ కల్గించేందుకు చేసినట్లుంది. ఎందుకంటే కథలో ఎక్కడా ఫీల్‌ కన్పించదు. ప్రేక్షకుడు హీరోతో ట్రావెల్‌ కాలేకపోతాడు. అందుకు ఇంకాస్త స్క్రీన్‌ప్లేలో జాగ్రత్త తీసుకోవాల్సింది. సినిమా స్లో నరేషన్‌ తో ఉంటుంది. కాస్త ఓపికతో చూడాలి. సక్సెస్‌కు ఎంత ఓపిక కావాలో ఈ సినిమా చూడటానికి కూడా కాస్త ఓపిక కావాల్సిందే. కథ, కథనం అలాంటిది. ఇందులోని క్యారెక్టర్స్‌ మనకు కొత్త కాదు. వేరే సినిమాల్లోనూ ఈ తరహా పాత్రల్ని చాలా మంది చేసేశారు.  
 
దర్శకుడు కిషోర్‌ తిరుమల డైలాగ్స్‌ చాలా బాగా రాసుకున్నాడు. ఆ డైలాగ్స్‌ కూడా సమయాన్ని, సందర్భాన్ని, సన్నివేశాన్ని బట్టి బాగా కుదిరాయి. హీరోయిన్‌ కళ్యాణి పాత్ర బాగుంది. నివేదా పాత్ర కూడా పూర్తి నెగెటివ్‌గా వుంటుంది. సెకండాఫ్‌‌లో వెన్నెల కిషోర్‌ నవ్వించాడు. మిగిలిన పాత్ర ధారులు తమ పాత్రలకు న్యాయం చేసారు. దేవిశ్రీ సాంగ్స్‌, రీ రికార్డింగ్‌ బాగుంది. కెమెరా వర్క్‌ బాగుంది. 'చిత్రలహరి' అంటే గతంలో అన్ని పాటలు ప్రతి శుక్రవారం వినిపించేవి. అవి పాటలు. అలాగే పలు జీవితాలు ఇలా వుంటాయనే లాజిక్కుతో టైటిల్‌ పెట్టినా.. ఎక్కడా అతికినట్లు వుండదు. ఈ చిత్రం కమర్షియల్‌గా వర్కవుట్‌ కాకపోవచ్చు.
 
రేటింగ్‌: 2/5
- ధనుంజయ్

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు