ఇంటిలోని దుష్టశక్తులు పోయేందుకు మవనడిని నర బలిచ్చిన తాత...

ఠాగూర్

సోమవారం, 1 సెప్టెంబరు 2025 (10:56 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో దారుణ ఒకటి వెలుగు చూసింది. ఇటీవల వెలుగు చూసిన 11వ తరగతి విద్యార్థి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దారుణానికి సూత్రధారిగా వ్యవహరించిన ఓ తాంత్రికుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో ఉన్న దుష్టశక్తులు పోవాలంటే నరబలి ఇవ్వాలని సలహా ఇచ్చి, ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న మంత్రగాడిని అదుపులోకి తీసుకున్నారు.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ప్రయాగ్‌రాజ‌్‌కు చెందిన పీయూష్ సింగ్ అలియాస్ యశ్ అనే విద్యార్థిని ఆగస్టు 26న అతడి తాత సరణ్ సింగ్ దారుణంగా హత్య చేశాడు. కాలేజీకి వెళుతున్న మనవడిని ఇంటికి పిలిచి, హతమార్చి, ఆ తర్వాత మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు, ఇప్పటికే సరణ్ సింగ్‌ను అరెస్టు చేశారు. 
 
అయితే, పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు జరపడంతో ఈ హత్య వెనుక కౌశాంబి జిల్లాకు చెందిన మున్నాలాల్ (45) అనే తాంత్రికుడి పాత్ర ఉన్నట్లు తేలింది. కుటుంబంలో వరుస ఆత్మహత్యలతో సరణ్ సింగ్ మానసికంగా కుంగిపోయి ఉండటాన్ని మున్నాలాల్ ఆసరాగా చేసుకున్నాడు. ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం ఉందని నమ్మించి, వాటిని తరిమికొట్టాలంటే మనవడిని బలి ఇవ్వాలని సలహా ఇచ్చాడు. అంతేకాకుండా, బలి ఇచ్చిన తర్వాత శవాన్ని తొమ్మిది ముక్కలు చేసి, వేర్వేరు దిక్కుల్లో పడేయాలని సూచించాడు.
 
తాంత్రికుడి మాటలు గుడ్డిగా నమ్మిన సరణ్ సింగ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పక్కా సమాచారంతో పోలీసులు ఆదివారం సాయంత్రం కరేలీ లేబర్ చౌరాహా వద్ద మున్నాలాల్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. మూఢనమ్మకాలతో అమాయక విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు