'డీజే.. దువ్వాడ జగన్నాథమ్' : కేక అంటున్న ప్రేక్షకులు... (రివ్యూ రిపోర్ట్)

శుక్రవారం, 23 జూన్ 2017 (11:05 IST)
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'డీజే: దువ్వాడ జగన్నాథమ్'. ఈ చిత్రం శుక్రవారం వ్యాప్తంగా విడుదలైంది. 'బాహుబలి-2' తర్వాత విడుదలవుతున్న పెద్ద సినిమా ‘దువ్వాడ జగన్నాథమ్’పై అల్లు అర్జున్ అభిమానులేకాకుండా సగటు సినీ ప్రేక్షకులు కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగినట్టుగా ఈ చిత్రం టాక్‌ను సొంతం చేసుకుంది. 
 
ఈ చిత్రం డీజేగా బన్నీ అద్భుతంగా అలరించాడని ఎన్నారైలు పేర్కొంటున్నారు. అదుర్స్‌లో బ్రాహ్మణ యాసలో జూనియర్ ఎన్టీఆర్ అలరించగా, అదే తరహాలో స్టైలిష్‌స్టార్ ఆకట్టుకున్నాడని వారు చెబుతున్నారు. ఈ చిత్రంలో విడుదలైన డీజే (దువ్వాడ జగన్నాథమ్) సినిమాలో అల్లు అర్జున్ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. అగ్రిడైమండ్ సంస్థ చేసిన స్కామ్ (కుంభకోణం)ను వెలికి తీసేందుకు బ్రాహ్మణ యువకుడిగా అవతారమెత్తిన బన్నీ తొలి అర్థభాగం హాస్య సన్నివేశాలతో అలరించాడు. 
 
మొదటి భాగం ముగియడానికి 20 నిమిషాల ముందు అసలు కథలోకి సినిమా ప్రవేశిస్తుందని, రెండోభాగం మొత్తం కథ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని బెనిఫిట్ షో చూసిన ఎన్నారైలు చెబుతున్నారు. కథ తెలిసిందే అయినా కథనం, కథను డీల్ చేసిన విధానం అద్భుతమన్నారు. బన్నీఖాతాలో మరో విజయం పడిందన్నారు. హీరోయిన్ కూడా సాధ్యమైనంతమేర ప్రేక్షకులను అలరించిందని, యధాశక్తి యువకులను అకట్టుకుందని తెలిపారు. 
 
ఈ చిత్రంలోని పాటలకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, పాటలు ఇంటాబయటా బాగున్నాయంటున్నారు. ఓవర్సీస్ సినీ అభిమానులను ఈ సినిమా బాగానే అలరించిందని టాక్. ఎంటర్‌టైన్‌మెంట్, మాస్ కలగలిపిన సినిమాగా ‘దువ్వాడ జగన్నాథమ్‌’ను ఎన్నారైలు అభివర్ణిస్తున్నారు.
 
మొదటి హాఫ్ మొత్తం ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిపోగా ఇంటర్వెల్‌కు ముందు 20 నిమిషాల నుంచి అసలు కథ ట్రాక్‌లోకి వస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. విజయవాడ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ‘అగ్రిడైమండ్’లాండ్ స్కామ్‌పై అండర్ కవర్ పోలీస్‌గా బన్నీ కనిపిస్తాడు. తమవాళ్లకు సంబంధించిన భూములను లాక్కునేందుకు ప్రయత్నించిన వారిని ఏ విధంగా మట్టుపెట్టాడనేది కథాంశమం. రొయ్యల నాయుడు పాత్రలో రావు రమేష్.. తండ్రి రావుగోపాల రావును గుర్తుకు తెచ్చారని ఓ ఎన్నారై ట్వీట్ చేశాడు. 
 
ఇక పాటల్లో బన్నీ డాన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని మరో ఎన్నారై అభిప్రాయపడ్డాడు. ‘గుడిలో మడిలో’ సాంగ్‌లో బన్నీ, పూజాహెగ్డే డాన్స్ ఇరగదీశారు. అందాల ఆరబోతలో తానేం తక్కువ తినలేదన్నట్లు పూజా హెగ్డే నటించిందంటున్నారు. విదేశాల్లో ఉండే ప్రధాన విలన్‌కు, పెళ్లిళ్లలో వంట చేసుకునే 'దువ్వాడ జగన్నాథమ్‌'కు సంబంధం ఏమిటనేది ఇంట్రస్టింగ్ పాయింటని చెబుతున్నారు. 
 
బ్రాహ్మణ పాత్రలో బన్నీ నటించిన తీరుకు ప్రేక్షకులు మంచి మార్కులే వేస్తున్నారు. అదుర్స్‌ సినిమాలో ఎన్టీఆర్ బ్రాహ్మణ యువకుడిగా నటించి మెప్పించినట్లుగానే... ఈ సినిమాలో తనదైనశైలిలో నటించి మంచి మార్కులే కొట్టేశాడు బన్నీ. మొత్తానికి బన్నీ అభిమానులు మెచ్చే కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా సినిమాను చెప్పుకోవచ్చని చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి