స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'డీజే: దువ్వాడ జగన్నాథమ్'. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. 'బాహుబలి-2' తర్వాత విడుదలవుతున్న పెద్ద సినిమా ‘దువ్వాడ జగన్నాథమ్’పై అల్లు అర్జున్ అభిమానులేకాకుండా సగటు సినీ ప్రేక్షకులు కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగినట్టుగా ఈ చిత్రం టాక్‌ను సొంతం చేసుకుంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ మరి ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? తెలుసుకుందాం చూద్ధాం.
దువ్వాడ జగన్నాథ శాస్త్రి(అల్లు అర్జున్) బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వంటమనిషి. పెళ్లిళ్లలో తన వంటకాల రుచిని అందరికీ పంచుతుంటాడు. తన చేతి వంటకు ఫిదా అయిపోయిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఏ వేడుకకైనా జగన్నాథాన్నే పిలిచి వంట చేయిస్తారు. అంటే చుట్టు పక్కల ఓ పది ఇరవై ఊళ్లలో ఏ వేడుకైనా శాస్త్రి చేతి వంట అక్కడ ఉండాల్సిందే.
అలా.. ఓ పెళ్లి వేడుకలో హీరోయిన్ పూజ (పూజ హెగ్డే) పరిచయం అవుతుంది. ఆమె ఫ్యాషన్ డిజైనర్. అలా వాళ్లిద్దరూ ప్రేమించుకుంటారు. అయితే... వాళ్ల ఊరిలో ఉన్న బ్రాహ్మణ సంఘానికి చెందిన భూములు ఆక్రమణకు గురవుతాయి. అయితే.. భూమి ఆక్రమణ వెనుక ఓ డాన్ ఉంటాడు. ఆ డాన్‌ను ఢీకొట్టడం కోసం పోలీస్‌తో కలిసి డీజే పేరుతో పని చేస్తుంటాడు జగన్నాథం. అయితే.. ఆ డాన్ ఎవరు? జగన్నాథం డీజేగా ఎందుకు మారాడు? అంతేకాదు.. భూమి ఆక్రమణ పేరుతో అక్కడ జరిగిన దారుణం ఏంటి? శాస్త్రి హైదరాబాద్‌లో కొంతమందిని టార్గెట్ చేసి మరీ చంపేస్తుంటాడు. ఎందుకు? వాళ్లను చంపాలని శాస్త్రిని పురుషోత్తం ప్రోత్సహిస్తాడు. ఈ పురుషోత్తం ఎవరు? రొయ్యల నాయుడు (రావు రమేశ్) అక్రమాలను శాస్త్రి ఎలా బయటపెట్టాడు? అనే ట్విస్టులతో సినిమా నడుస్తుంది.
ఇక వంటవాడిగా, మర్డర్ చేస్తూ డీజేగా రెండు పాత్రల్లో వైవిధ్యంగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు అర్జున్. యాక్షన్, డ్యాన్స్‌లో మళ్లీ తన ప్రతాపాన్ని చూపించాడు. హీరోయిన్ పూజా హెగ్డే గ్లామర్ రోల్ పాత్ర పోషించింది. తన అందంతో ప్రేక్షకుడి మనసును దోచుకుంది. మిగితా నటులంతా తమ పాత్రల మేర నటించారు. ఇక వంటవాడిగా అల్లు అర్జున్ చేసే సందడి హాస్యాన్ని పండించగా, డీజేగా బన్నీ చేసిన యాక్షన్ మాస్‌ను తలపిస్తుంది. ఇక డైరెక్టర్ హరీశ్ శంకర్ డైలాగ్స్, దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాలో హైలెట్స్‌గా నిలుస్తాయి. మొత్తం మీద దువ్వాడ జగన్నాథం సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు కోరుకునే అన్ని అంశాలను మేళవిస్తూ వచ్చిన ఈ మూవీ సగటు ప్రేక్షకుడిని మెప్పిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మొదటి అర్థభాగం ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిపోగా ఇంటర్వెల్‌కు ముందు 20 నిమిషాల నుంచి అసలు కథ ట్రాక్‌లోకి వస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. విజయవాడ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ‘అగ్రిడైమండ్’లాండ్ స్కామ్‌పై అండర్ కవర్ పోలీస్‌గా బన్నీ కనిపిస్తాడు. తమవాళ్లకు సంబంధించిన భూములను లాక్కునేందుకు ప్రయత్నించిన వారిని ఏ విధంగా మట్టుపెట్టాడనేది కథాంశం. రొయ్యల నాయుడు పాత్రలో రావు రమేష్.. తండ్రి రావుగోపాల రావును గుర్తుకు తెచ్చారు.
ఇక పాటల్లో బన్నీ డాన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 'గుడిలో మడిలో’ సాంగ్‌లో బన్నీ, పూజాహెగ్డే డాన్స్ ఇరగదీశారు. అందాల ఆరబోతలో తానేం తక్కువ తినలేదన్నట్లు పూజా హెగ్డే నటించింది. విదేశాల్లో ఉండే ప్రధాన విలన్‌కు, పెళ్లిళ్లలో వంట చేసుకునే 'దువ్వాడ జగన్నాథమ్'కు సంబంధం ఏమిటనేది ఇంట్రస్టింగ్ పాయింట్.
బ్రాహ్మణ పాత్రలో బన్నీ నటించిన తీరుకు ప్రేక్షకులు మంచి మార్కులే వేయొచ్చు. అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ బ్రాహ్మణ యువకుడిగా నటించి మెప్పించినట్లుగానే... ఈ సినిమాలో తనదైనశైలిలో నటించి మంచి మార్కులే కొట్టేశాడు. మొత్తానికి బన్నీ అభిమానులు కాకుండా సగటు ప్రేక్షకుడు మెచ్చే కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఈ చిత్రం బన్నీ కెరీర్‌లో నిలిచిపోనుంది.