గాడి త‌ప్పి పిచ్చెక్కించే పాగ‌ల్

శనివారం, 14 ఆగస్టు 2021 (16:42 IST)
pagal still
నటీనటులు: విశ్వక్సేన్-నివేథా పేతురాజ్-సిమ్రన్ చౌదరి-మేఘ లేఖ-మురళీ శర్మ-భూమిక-రాహుల్ రామకృష్ణ-రామ్ ప్రసాద్-మహేష్ తదితరులు
సాంకేతిక‌తః 
ఛాయాగ్రహణం: మణికందన్, నేపథ్య సంగీతం: జేమ్స్ లియోన్, సంగీతం: రధన్,  నిర్మాత: బెక్కెం వేణుగోపాల్, రచన-దర్శకత్వం: నరేష్ కుప్పిలి.
 
గూగుల్‌.. గూగుల్‌.. పాగ‌ల్‌.. పాగ‌ల్‌.. అంటూ యువ‌త‌లో క్రేజ్ తెచ్చిన క‌థానాయ‌కుడు విశ్వక్సేన్ మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో సినిమా చేశాన‌ని చెప్పాడు. 16వేల గులాబీలు కాలేజీ, షాపింగ్‌మాల్స్‌, థియేట‌ర్ల‌లో ఇస్తూ పాగ‌ల్‌ను ప్ర‌మోష‌న్ చేసుకున్నాడు. అయితే గులాబీలు ఇవ్వ‌డానికి కొన్నిచోట్ల థియేట‌ర్ల‌లో జ‌నాలేలేరనీ, త‌న పాగ‌ల్ సినిమాతోనైనా థియేట‌ర్ల‌ను ర‌ప్పిస్తాన‌ని అతి న‌మ్మ‌కంతో చెప్పాడు. ఈ నగరానికి ఏమైంది.. ఫలక్ నుమా దాస్.. హిట్ లాంటి చిత్రాలతో గుర్తింపు సంపాదించుకున్న యువ కథానాయకుడు ‘పాగల్’. క్రేజీ టీజర్.. ట్రైలర్లతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుకున్నాడు. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంచనాలను ‘పాగల్’ ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
 
కథ:
 
ప్రేమ్ (విశ్వక్సేన్)కు చిన్న‌త‌నంలో తండ్రి వుండ‌డు త‌ల్లి (భూమిక) అంటే చాలా ఇష్టం. హ‌ఠాత్తుగా త‌ల్లి చ‌నిపోతుంది. ఒంట‌రివాడు అయిపోతాడు. మనం ఎంత ప్రేమిస్తే.. ఎదుటి వాళ్లు మనల్ని తిరిగి అంత ప్రేమిస్తారని తల్లి చెప్పిన మాట‌లు వెంటాడుతుంటాయి. అందుకే హైస్కూల్‌లోనే తోటి అమ్మాయిల‌కు గులాబి పువ్వు ఇస్తూ ఐలవ్యూ చెప్పడం మొదలుపెడతాడు. ఓ అమ్మాయికి ఐల‌వ్‌యూ చెబితే వ‌య‌స్సులో త‌న‌కంటే చిన్న‌వాడ‌నీ, ప్రేమించాలంటే ఉద్యోగం, జీతం, ఆస్తి అనేవి అమ్మాయి చూస్తుంద‌ని క్లాస్ పీకుతుంది. ఆ త‌ర్వాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పొందుతాడు. మంచి జీతం వ‌స్తుంది. తీరా ఎవ‌రూ అత‌న్ని ప్రేమించ‌క‌పోతే స్నేహితుల సూచ‌న‌తో వైజాగ్ వెళ‌తాడు. అక్క‌డ ఇదే ప‌రిస్థితి. అలాంటి సమయంలోనే తీర (నివేథా పేతురాజ్) అనే అమ్మాయితో ప్రేమ్ ప్రేమలో పడతాడు. త‌న‌కు అప్ప‌టికే ఎంగేయ్ అయిపోతుంద‌ని చెబుతుంది. అయినా స‌రే ప్రేమిస్తానంటాడు. ఆ త‌ర్వాత తీర ఏమిచేసింది? అనేది మిగిలిన క‌థ‌.
 
విశ్లేషణ:
క‌థ‌లో పాయింట్‌. ప్రేమ‌. మనం ఎంత ప్రేమిస్తే.. ఎదుటి వాళ్లు మనల్ని తిరిగి అంత ప్రేమిస్తారని తల్లి చెప్పిన మాట‌లే హీరోకు దిక్యూచి. ఆ క్ర‌మంలో అందం త‌క్కువ‌గ‌ల అమ్మాయిని ప్రేమిస్తాడు. అవ‌న్నీ బెడిసికొడ‌తాడు. అవి చూడ్డానికి వినోదాన్ని పంచుతాయి. ఆ త‌ర‌హాలోనే ఎం.ఎల్‌.ఎ.గా నిల‌బ‌డిన ముర‌ళీశ‌ర్మ‌ను కూడా ప్రేమిస్తాడు. ఈ ప్రేమ ట్రాక్ కొత్త‌గా వున్నా. చూసేవారికి కాస్త ఎంట‌ర్‌టైన్ ఇస్తుంది. ఓ ద‌శ‌లో త‌న త‌ల్లిని మోసం చేసిన వ్య‌క్తి ఇత‌నే అయివుంటాడ‌నే ద‌ర్శ‌కుడు టెక్నిక్‌గా చూపించాడు. అందుకోసం యాక్ష‌న్ సీన్లు అన్నీ అయ్యాక అస‌లు అత‌న్ని ఎందుకు ల‌వ్ చేస్తున్నాడ‌నేది సెకండ్ ఆఫ్ క‌థ‌. ఆ క‌థే ప్రేక్ష‌కుల్ని నిరాశ‌కు గురిచేస్తుంది.
 
మొద‌టి భాగం స్పీడ్‌గా స‌ర‌దాగా అల్ల‌రిచిల్ల‌రిగా సాగిపోతుంది. మ‌ధ్య‌లో త‌ను ప్రేమించిన అమ్మాయిల్ని ఏడిపిస్తున్న ఓ న‌లుగురికి బుద్ధి చెప్ప‌డం ఇవ‌న్నీ ఫ‌న్నీగా వుంటాయి. కానీ ముర‌ళీశ‌ర్మ‌ను ప్రేమించే స‌న్నివేశం నుంచి క‌థంతా గాడి త‌ప్పింది. అప్పుడెప్పుడో ఆర్య సినిమాలో వున్న కాన్సెప్ట్‌ను కాస్త భిన్నంగా హీరో పాత్ర‌ను తీర్చిదిద్దాడ‌నిపిస్తుంది. కొన్ని స‌న్నివేశాల్లో ఊస‌ర‌వెల్లి సినిమాల్లోని మేన‌రిజాలు క‌నిపిస్తాయి. ఇంతా చేస్తే త‌న త‌ల్లి చెప్పిన మాట‌ల‌కు సంబంధించిన అమ్మాయిని వెతుక్కునే క్ర‌మంలో ఓ అమ్మాయిని ప్రేమించ‌డం, ఆమె త‌న్ని ప్రేమించ‌డం 6నెల‌లు ష‌ర‌తు పెట్ట‌డం అన్నీ బాగానే వుంటాయి. కానీ అవి ఎక్క‌డా ఫీల్ క‌లిగించ‌వు.
 
- త‌ల్లిలా ప్రేమించే అమ్మాయి కోసం వెత‌క‌డం అనేది క‌రెక్టే అయినా దాన్ని రాసుకున్న విధానం బాగోలేదు. గీత గోవిందం సినిమాలోనూ ఆ హీరో అలానే వెతుకుతాడు. కానీ హీరోయిన్ త‌ల్లిలా ఎవ‌రూ ప్రేమించ‌రు. ఆ పోలిక క‌రెక్ట్ కాద‌ని క్లాస్ పీకుతుంది కూడా. ఇక త‌ల్లి గురించి వెల‌క‌ట్ట‌లేని ప్రేమ అనేది బిచ్చ‌గాడులో చూపించేశారు. క‌నీసం ఆ సినిమాను కూడా విశ్వ‌క్‌సేన్ చూడ‌లేద‌ని చెప్ప‌డం కూడా చిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే మాతృమూర్తిపై సినిమాలు తీస్తే అన్నీ ఆడ‌తాయ‌ని అనుకోవ‌డం క‌రెక్ట్ కాదు. అందులో చూసే ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ కావాలి. అదేమీ ఇందులో క‌నిపించ‌వు.
 
- సాప్ట్‌వేర్ ఉద్యోగం వ‌చ్చాక క‌నీసం ఆ ఉద్యోగం చేసిన‌ట్లు హీరో ఎక్క‌డా క‌నిపించ‌డు. కేవ‌లం ముగింపు వ‌ర‌కు అమ్మాయిల వెంట ప‌డ‌డ‌మే అత‌ని ప‌ని. ఇలా అమ్మాయి కనిపించగానే ఐలవ్యూ చెప్పేస్తే ఆ అమ్మాయి నుంచి అతను కోరుకున్నంత ప్రేమ ఎలా తిరిగొచ్చేస్తుంది. ఇదేం లాజిక్. ఈ లాజిక్ గురించి చర్చే ఉండదు. సినిమా పేరే ‘పాగల్’ అని పెట్టుకున్నాక.. హీరో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడాన్ని అర్థం చేసుకోవచ్చు. ముగింపు వ‌ర‌కు అంతే పిచ్చిగా వుంటుంది.
 
- హైదరాబాద్ లో అమ్మాయిలుకంటే వైజాగ్ అమ్మాయిలు ఈజీగా పడిపోతారని తెలిసి అక్కడికి వెళ్లి ప్రేమ ప్రయత్నాలు సాగించడం  ఈ క్రమంలో ఒక్కో అమ్మాయితో ప్రేమాయణం.. ప్రతి లవ్ స్టోరీలోనూ ఒక ట్విస్ట్.. ఇలా ప్రథమార్ధంలో కాలక్షేపానికైతే డోకా లేదు. ముఖ్యంగా రాహుల్ రామకృష్ణ బ్యాచ్.. హీరోకు మధ్య వచ్చే కామెడీ ట్రాక్ ప్రథమార్ధానికి హైలైట్ గా నిలిచింది. ద్వితీయార్ధంలో నడిచే కథ మాత్రం ప్రేక్షకుడి కొత్త ‘సినిమా’ చూపిస్తుంది. ఈ ప్రేమకథ మొదలయ్యాక ఎక్క‌డా ఫీల్ క‌ల‌గ‌దు. మొత్తంగా ద్వితీయార్ధానికి వచ్చేసరికి ‘పాగల్’ ఎటూ కాకుండా తయారైంది. ఇక హీరోయిన్-తండ్రి ముర‌ళీశ‌ర్మ మధ్య వచ్చే ట్రాక్ అయితే ప్రేక్షకులు పూర్తిగా పిచ్చోడిని చేసేలా వున్నాయి.
 
- విశ్వక్సేన్ క‌థంతా న‌డిపించాడు. స్టైలింగ్ దగ్గర్నుంచి ఈ పాత్ర మీద అతను పెట్టిన శ్రద్ధ తెరమీద కనిపిస్తుంది. అయాయకత్వంతో కూడిన అల్లరితో అతను కొన్ని సన్నివేశాల్లో బాగానే ఎంటర్టైన్ చేశాడు. ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగానే చేశాడు.. ఆ సన్నివేశాల్లోనే బలం లేకపోయింది. 
 
- రధన్ సంగీత దర్శకుడిగా ఒక్క పాటలో మెరిపిస్తాడు. లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం కూడా బాగుంది. కెమెరామన్ మణికందన్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. సినిమాకు అవసరమైన మేర నిర్మాణ విలువలున్నాయి. కొత్త ద‌ర్శ‌కుడు ఎంచుకున్న పాయింట్ ను ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేయడంలో మాత్రం తడబడ్డాడు. ఈ కథను ఎలా ముందుకు తీసుకెళ్లాలో.. ఎలా ముగించాలో తెలియని అయోమయంలో సినిమాను ట్రాక్ తప్పించేశాడు. అందుకేనేమో ప్రీరిలీజ్‌లో హీరో ఘాటుగా మాట్లాడాడు. నేను థియేట‌ర్ల‌కు జ‌నాల‌ను ర‌ప్పిస్తాను. అలా కాక‌పోతే పేరు మార్చుకుంటాన‌న్నాడు. మ‌రి ఏంచేస్తాడో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు