కిక్ ఇచ్చే బ్రాందీ డైరీస్

శుక్రవారం, 13 ఆగస్టు 2021 (18:24 IST)
Brandy Diaries
నటీనటులుః సునీత సద్గురు, నవీన్ వర్మ, కెవి శ్రీనివాస్, రవీంద్ర బాబు, దినేష్ మాడ్నె
సాంకేతిక నిపుణులుః సినిమాటోగ్రఫీ - ఈశ్వరన్ తంగవేల్, ఎడిటర్ - యోగ శ్రీనివాస్, సంగీతం - ప్రకాష్ రెక్స్, బ్యానర్ - కలెక్టివ్ డ్రీమర్స్, నిర్మాత - లెల్ల శ్రీకాంత్, రచన దర్శకత్వం - శివుడు
 
ఇప్ప‌టి త‌రానికి ఆల్క‌హాల్ అనేది కామ‌న్ అయింది. దీనిపై ప‌లు సినిమాలు వ‌స్తున్నాయి. ఎక్కువ‌గా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల నేప‌థ్యంలో వ‌చ్చిన అటువంటి సినిమాలు రొటీన్‌గా మారాయి. కానీ అందుకు భిన్నంగా సినిమాపై త‌ప‌న‌తో అసిస్టెంట్ కమీషనర్ అఫ్ టాక్స్ ఆఫీసర్ గా ప‌నిచేసిన శివుడు, ఆ త‌ర్వాత లెక్చ‌ర‌ర్‌గా పాఠాలు చెబుతూ అనుకోకుండా తాగుడుకు బానిస అయ్యాడు. ఆయ‌న జ‌ర్నీలో ఎంతోమందిని లోతుగా ప‌రిశీలించి క‌థ‌ను రాసుకుని తీసిన సినిమానే బ్రాందీ డైరీస్. విన‌డానికే ఓ వ‌ర్గానికి ప‌రిమితం అనిపించేలా వున్న ఈ సినిమా ఈ శుక్ర‌వార‌మే విడుద‌లైంది. మ‌రి అదెలావుందో చూద్దాం.
 
క‌థ‌గా చెప్పాలంటే,
 
ఐదుగురు విభిన్న నేపథ్యాల క‌థ ఈ సినిమా. డిప్యూటీ ఎమ్మారో గా చేసే  శేఖర్, సివిల్స్ ప్రిపేర్ అయ్యే శ్రీ‌ను, పనీ పాట లేని జాన్సన్, చెప్పుల కంపెనీలో  ప‌నిచేసే కోటి, మేథావి అయిన వ‌ర్మ‌. ఈ ఐదుగురు మందు వ‌ల్ల స్నేహితుల‌వుతారు. అలా క‌లిసి త‌మ సాధ‌క‌బాధ‌లు చెప్పుకుంటుంటారు. ఈ ఐదు పాత్రల ద్వారా దర్శకుడు చెప్పిన ఫిలాసపీ, లైఫ్ జర్నీనే బ్రాందీ డైరీస్. ఈ క‌థ‌లో హీరో పాత్ర శ్రీనుది. అతను సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే భవ్య అనే యువతిని ప్రేమిస్తాడు. మద్యపానం అలవాటు, అతని ప్రేమకు ఆటంకం అవుతుంది. అలా మిగిలిన వారి జీవితాల‌ను మార్చేస్తుంది. అది ఎలా? ఏమిటి? అనేది మిగిలిన సినిమా. 
 
విశ్లేష‌ణః
ఈ క‌థ‌ను ద‌ర్శ‌కుడు శివుడు బాగా స‌మాజాన్ని స్ట‌డీచేసి రాసుకున్న‌ట్లుంది. ద‌ర్శ‌కుడిగా త‌న త‌ప‌న‌ను చూపించాడు.ప్రేమ, పెళ్లి, స్నేహం, కెరీర్ ఇలా చాలా అంశాలను మద్యం నేపథ్యంతో తెరకెక్కించాడు. క‌థనంలో మ‌న‌కు చాలా మంది జీవితాలకు అద్దం పడుతుంది. వాస్తవికంగా సినిమాను రూపొందించడం మరో ప్రధాన విషయం. బ్రాండీ డైరీస్  అనే పెట్టి ఎక్కడా అస‌భ్య‌త‌కు తావులేకుండా గాడిత‌ప్ప‌కుండా చేయ‌డం విశేషం. ఒక ప‌క్క పాత్రల గమనాన్ని, వాటి జీవన శైలిని సింబాలిక్ గా చూపిస్తూ కథను తెరకెక్కించారు.
 
కొత్త‌వారైనా సునీత సద్గురు, నవీన్ వర్మ, కెవి శ్రీనివాస్, రవీంద్ర బాబు, దినేష్ మాడ్నె తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రకాష్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బలాన్నిచ్చాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ప‌రిమిత బ‌డ్జెట్‌తో పొందిక‌గా సినిమాను తెర‌కెక్కించాడు. వర్మ పాత్ర ద్వారా చాలా ఫిలాసఫీ చెప్పించారు దర్శకుడు శివుడు. అవి ద‌ర్శ‌కుడిగా అనుభ‌వంలోకి వ‌చ్చిన‌వి అన్న‌ట్లుగా వున్నా, అంద‌రినీ ఆలోచించేలా చేస్తాయి. శ్రీను భవ్య మధ్య వచ్చేసాగే ప్రేమ స‌న్నివేశాలు బాగానే వున్నాయి. 
 
ఇక ఇప్ప‌టి ట్రెండ్‌కు త‌గిన‌ట్లు ట్విస్ట్‌లు పంచ్ డైలాగ్‌లు అనేవి పెద్ద‌గా లేక‌పోయినా జీవితాన్ని ఆవిష్క‌రించాడు ద‌ర్శ‌కుడు. ఇక ఫొద్ద‌స్త‌మానం తాగుడు, వాగుడు అనే చిన్న‌పాటి స‌న్నివేశాలు త‌గ్గిస్తే బాగుండేది. జాన్స‌న్ పాత్ర వాంతులు చేసుకోవ‌డం, ఇంటిలోవారిని ప‌ట్టించుకోక‌పోవ‌డం వంటివి జ‌రిగే సంఘ‌ట‌న‌లైనా ఆ పాత్ర‌ను కుదిస్తే బాగుండేవి. ఇలాంటి చిన్న‌లోపాలు మిన‌హా రొమాన్స్‌లోనూ ఎక్క‌డా హ‌ద్దుమీర‌కుండా ద‌ర్శ‌కుడు తీసుకున్న జాగ్ర‌త్త బాగుంది. ఫైన‌ల్‌గా యువ‌త‌కు మంచి కిక్ ఇచ్చే డైరీస్ అని చెప్ప‌వ‌చ్చు.
రేటింగ్ 3/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు